Future Proofing ప్రస్తుత  విద్యారంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అని యంగ్ ఇండియా విశ్వవిద్యాలయం వీసీ, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు VLVSS సుబ్బారావు అన్నారు.  ABP Network హైదరాబాద్‌లో నిర్వహించిన ABP DESAM  SmartEd కాంక్లేవ్‌లో ఆయన కీలకోపన్యాసం  చేశారు. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. అనేక అంశాలను ప్రస్తావించారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఇవన్నీ కూడా కేరీర్లపై ప్రభావం చూపుతున్నవే కానీ.. విద్యార్థి దశలోనే మార్పులకు అనుగునమైన దృక్పథాన్ని (Attitude) ను  విద్యార్థుల్లో నెలకొల్పడమే ఇప్పుడున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు.


గ్రోత్ మైండ్‌ సెట్‌తో ఉన్న విద్యార్థుల వల్ల సంస్థలకు కానీ.. లేదా  పెద్ద పెద్ద ఇనిస్టిట్యూట్ల వల్ల (IIM, IIT) విద్యార్థులకు లాభం కలుగుతోంది కానీ.. ఓ వ్యవస్థగా విద్యార్థుల్లో సానుకూల దృక్పథం, మార్పులకు అనుగునంగా తమను తాము మలుచుకునే విధానాన్ని అభివృద్ధి చేయడంలో విద్యా సంస్థలు ఇంకా సఫలం కాలేదన్నారు. అప్‌గ్రెడేషన్, Future Proofing అన్నవి అత్యంత కీలకమని.. విద్యార్థి దశలోనే భవిష్యత్ కు సన్నద్ధం కావాలని చెప్పారు.


పాఠశాల విద్య ర్యాపిడ్ గ్రోత్


“విద్యారంగం ఒక యూనిఫైడ్‌గా అభివృద్ధి చెందాల్సి ఉంది.. కానీ మన దేశంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ర్యాపిడ్ గ్రోత్ ఉంటోంది.. దానికి తగ్గట్లుగా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఎదగడం లేదు..” అని ఆయన అన్నారు ఇండస్ట్రీ , సర్వీస్ సెక్టార్లకు అనుబంధంగా విద్యారంగం వృద్ధి చెందడం లేదు.. ఇది ఓ సామాజిక సమస్యగా మారిపోయిందన్నారు.“సాధారణ డిగ్రీ కోర్సుల నుండి, ఏటా 98 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత అవుతారు. వారిలో 55 లక్షల మంది నిరుద్యోగులుగా ఉంటారు. కాబట్టి, మనం ఏటా 55 లక్షల మంది విద్యార్థులను ఉద్యోగాలు లేకుండా విడుదల చేస్తున్నాం.” అని చెప్పారు. 


యంగ్ ఇండియా అందుకే వచ్చింది.


ఇండస్ట్రీకి  అవసరమైన నైపుణ్యాలు కల్పించలేకపోవడం… ఉన్నవారికి సరిపడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం.. ఓ అసమంజసమైన గ్రోత్‌కు కారణమవుతుంది.. ఈ సమస్యను అధిగమించడానికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వచ్చిందన్నారు.   94శాతం మంది పేద విద్యార్థులకు ఆఫర్లు ఇవ్వగలిగాం అని వీసీ చెప్పారు. హైదారబాద్‌లో ఉన్నఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వగలుగుతున్నాం అని చెప్పారు. తాము ఎంత చేస్తున్నా.. కొన్ని సమస్యలు తప్పడం లేదని.. ఫీజు రీయెంబర్స్‌మెంట్ వల్ల చాలా మందికి చదువుకునే అవకాశం వస్తున్నా..  ఫీజు రీయెంబర్స్ మెంట్ కోసమే కొన్ని చోట్ల వాళ్లు హాజరుకాకపోయినా అటెండెన్స్ ఇస్తున్నారని.. దీనివల్ల విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని చెప్పారు. “9.6 CGPA వచ్చిన విద్యార్థికి ఒక్క లైన్ రాయడం కూడా రాదు. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే మన విద్యార్థులు కొన్ని జాడ్యాలు వదిలించుకోవాలి. స్విగ్గి, జోమాటో, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిల్లో ప్రొబేషన్ జాబ్స్ వీళ్లు చేయడం లేదు. ఆ టైమ్ లో ప్యాకింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. దానిని చిన్నతనంగా భావిస్తున్నారు. విదేశాల్లో అయితే విద్యార్థులు నేలను తుడుస్తారు. ” అని వీసీ సుబ్బారావు అన్నారు. విద్యార్థులందరినీ స్కిల్ యూనివర్సిటీలో పెట్టడం సాధ్యం కాదు. అందుకే కాలేజీల్లోనే స్కిల్ కోర్సులు పెట్టబోతున్నాం. ౩౩ అటానమస్ కాలేజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.. అక్కడ వాళ్లు మాకు క్లాస్ రూమ్ ఇస్తే… మిగతాది మేం చూసుకుంటాం.


గ్రాడ్యుయేషన్ లెవల్‌లో ప్రంపంచస్థాయి మేనేజ్‌మెంట్ కరిక్యులమ్ ఉండాలి


“అందరూ BBA మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అని తీసుకుంటారు, ఇండియాలో మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ సాధారణంగా పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్థాయిలో మొదలవుతుంది, IIM లెవల్లో మంచి మేనెజ్‌మెంట్ విద్య ఉంది కానీ.. గ్రాడ్యుయేషన్ స్థాయిలో లేవు. గ్రాడ్యుయేషన్‌లో ఒక వరల్డ్ క్లాస్ కర్రికులం మేనేజ్‌మెంట్‌లో అవసరం. నేను బజాజ్ ఫైనాన్స్‌తో చర్చల్లో ఉన్నాను. మనం రాహుల్ బజాజ్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది, ఇక్కడ మనం BBA కర్రికులం క్యూరేట్ చేస్తాం” అని తెలిపారు. డిగ్రీ లెవల్లో ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుందని.. అప్రెంటిస్ షిప్‌కూడా కరిక్యులమ్‌లో భాగం చేస్తామని ఆయన చెప్పారు.


స్కిల్స్ కోసం అమీర్‌పేట్ వెళ్లని రోజు మనం సక్సెస్‌


విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్‌ నేర్పించాలి. కానీ మనకు క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ కోసం ఒక పార్య ప్రణాళికే లేదని వీసీ అన్నారు. “ఆ పని మేం చేయబోతున్నాం. బోధన ఎలా ఉండాలి.. లైఫ్ స్కిల్స్ ఎలా నేర్పించాలి అన్నది మేం టీచర్లకు నేర్పించనున్నాం.” అని ఆయన చెప్పారు. ఈరోజు దేశంలో ఒక లక్ష మందిని స్కిల్ చేయాలనుకుంటే, ట్రైనర్లు లేరు. దీన్ని ఒప్పుకోవాలని, ఇది మనం ఎదుర్కొంటున్న మౌలికమైన సమస్య అన్నారు దీనిని పరిష్కరించకుండా... మనం లక్ష, రెండు లక్షల మందికి శిక్షణ ఇచ్చాం.. అని కేవలం నెంబర్లు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదని అన్నారు.   “మన  హైదరాబాద్‌లోనే తీసుకుంటే ఇక్కడ విద్యార్థి  చదువు కోసం కాలేజ్ కు వస్తాడు.. స్కిల్ కోసం అమీర్ పేట్ వెళతాడు  ఇదీ వాస్తవ పరిస్థితి. అమీర్‌పేట్లో వందలు, వేలల్లో శిక్షణ సంస్థలు ఎలా ఉంటున్నాయి. అదే స్కిల్స్‌ మన విద్యాసంస్థల్లో ఎందుకు లేవు. దీని గురించి మా మంత్రిగారు, మేం మాట్లాడుకుంటూ ఉంటాం. అమీర్‌పేట్ విద్యార్థి వెళ్లని రోజున మనం సక్సెస్ అయినట్లు.. ! అని వీసీ వివరించారు.