Mosquitoes: దోమలు రక్తాన్ని పీలుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. కాలంతో సంబంధం లేకుండా దోమలు వస్తూనే ఉంటాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా కుడుతూనే ఉంటాయి. అయితే వేసవి కాలంలో ఎక్కువగా ఉండే దోమలు.. చలికాలం వచ్చేసరికి తక్కువగా కనపడతాయి. అసలు దోమలు రక్తాన్ని ఎందుకు పీలుస్తాయి? శీతాకాలంలో ఎందుకు తక్కువగా ఉంటాయి? దోమలపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితాలు ఏంటి? వీటన్నింటికీ జవాబులు ఈ కథనంలో చూద్దాం.
మొదట్లో దోమలకు రక్తం తాగే అలవాటు లేదు. ఈ మార్పు నెమ్మదిగా వచ్చింది. దోమలు జీవించడానికి మనుషులలాగే నీరు అవసరం. వేసవి కాలంలో వాటికి, వాటి సంతానానికి నీరు లభించనప్పుడు అవి మానవులు, జంతువుల రక్తం తాగడం ప్రారంభించాయి. అందుకనే ఎండాకాలంలో అవి ఎక్కువగా ఉంటాయి. .
దోమలపై అధ్యయనం
న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని ఈడిస్ ఈజిప్ట్ దోమలపై అధ్యయనం చేశారు. ఇవి జికా వైరస్, డెంగ్యూ, పసుపు జ్వరం కలిగించే దోమలు. న్యూ సైంటిస్ట్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ఆఫ్రికాలోని దోమలలో అనేక రకాల ఈడిస్ ఈజిప్ట్ దోమలు నివసిస్తాయి. ఈ జాతి దోమలన్నీ రక్తం తాగవు.
ఆఫ్రికాలోని సబ్-సహారా ప్రాంతంలోని 27 ప్రాంతాల నుంచి ఈడిస్ ఈజిప్ట్ దోమ గుడ్లను తీసుకుని వాటి నుంచి దోమలు బయటకు వచ్చేలా చేశామని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకుడు నోహ్ రోస్ చెప్పారు. వాటిని మనుషులు నివసించే చోట, లాక్ చేసిన కంపార్ట్ మెంట్లలో వదిలేసి.. అవి రక్తం తాగే విధానాన్ని పరిశీలించామని తెలిపారు. దీని ద్వారా ఈడిస్ ఈజిప్ట్ దోమల జాతుల ఆహార విధానం గురించి తెలిసిందని చెప్పారు.
దోమల్లో రక్తం తాగే మార్పు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వచ్చింది. పెరుగుతున్న నగరాల కారణంగా దోమలు నీటి కొరతతో పోరాడటం ప్రారంభించాయి. చివరికి మనుషులు, జంతువుల రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయి. అయితే, మనుషులు నీటిని నిల్వ చేసే చోట అనాఫిలిస్ దోమలకు (మలేరియా దోమ) ఎలాంటి సమస్య ఉండదు. కూలర్లు, పడకలు, కుండలు వంటి ప్రదేశాలలో అవి సౌకర్యవంతంగా పునరుత్పత్తి చేస్తాయి. నీటి లభ్యత లేనప్పుడు రక్తం తాగేందుకు మనుషులు, జంతువులపై దాడిచేస్తాయి.