PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?

PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన వారికి రుణం లభించనుంది.

Continues below advertisement

Vidya Lakshmi Education Loan: దేశంలోని ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వీరు ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు అవసరమైనా రుణాలను అందించేందుకు 'పీఎం విద్యాలక్ష్మి స్కీమ్'ను తెచ్చింది. ఈ మేరకు బుధవారం (నవంబరు 6) ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం- విద్యాలక్ష్మీ ద్వారా ఏటా 22 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్యకు దూరం కాకూడదనే క్యాబినెట్ ఈ పథకాన్ని ఆమోదించిందని అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. 2024-25 నుంచి 2030-31 వరకు మొత్తం రూ.3,600 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్.శెట్టి స్వాగతించారు. 

Continues below advertisement

ఎవరు అర్హులు?(Vidya Lakshmi Scheme Eligibility)
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్(NIRF) ఆధారంగా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో (క్యూహెచ్‌ఈఐ) ప్రవేశాలు పొందేవారెవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాసంస్థలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలూ ఉంటాయి. విద్యార్థులు ఎలాంటి పూచీకత్తు, హామీదారులు అవసరం లేకుండానే బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఏటా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చు. ఆయా కోర్సులకు సంబంధించిన పూర్తి ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను దీనిద్వారా చెల్లించవచ్చు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ఆయా కేటగిరీలకు, కొన్ని రంగాలకు ఇచ్చే ర్యాంకింగులను, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత విద్యాసంస్థలను (101-200 ర్యాంకులు), కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను పరిగణనలో తీసుకుంటారు. విద్యాలక్ష్మి రుణాలకు ఎటువంటి తనఖా, ష్యూరిటీలు అవసరం లేదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు విద్యాలక్ష్మి పథకానికి అర్హులు. 

రూ.7.5 లక్షల వరకు రుణాలు..(Vidya Lakshmi Education Loan Interest rate)
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద రూ.7.5 లక్షల లోపు రుణాలకైతే 75 శాతం వరకు క్రెడిట్ గ్యారంటీ పొందవచ్చు. దీనివల్ల బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి మద్దతు ఇచ్చినట్లవుతుంది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉంటూ, ఇతరత్రా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల కిందికి గానీ, వడ్డీ రాయితీ పథకాల కిందికి గానీ రానివారికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. విద్యార్థులకు మొత్తం రూ.10 లక్షల వరకు రుణాలకు లభిస్తాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కొత్తగా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతిఏటా లక్ష మంది స్టూడెంట్లకు వడ్దీ రాయితీ ఇస్తారు. ఇందులో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరి టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 

ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు..(Vidyalakshmi Portal)
అర్హులైన విద్యార్థులు రుణాలు పొందడానికి వీలుగా పీఎం-విద్యాలక్ష్మి అనే ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, రుణం కోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి, వడ్డీ రాయితీ కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అర్హులైన విద్యార్థులకు కేవలం 15 రోజుల్లోనే రుణం మంజూరు చేయనున్నారు. రుణం కోసం సమర్పించే దరఖాస్తును తిరస్కరణకు గురైతే.. కారణాలను ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం కూడా ఈ పోర్టల్ ద్వారానే కొనసాగుతుంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement