US Faces 80 Percent Drop In Indian Students: అమెరికాకు చదువు కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎవరూ ఊహించనంతగా పడిపోనుంది. వీసా సంక్షోభం తీవ్రమవుతున్న కొద్దీ అమెరికాకు భారతీయ విద్యార్థుల సంఖ్య 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుందని అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఏడాది అమెరికాలోని విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థుల సంఖ్యలో 80 శాతం వరకూ తగ్గుదలను చూశాయి. ట్రంప్ పరిపాలనా విధానాల కారణంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఏర్పడుతున్న ఆటంకాలు దీనికి కారణంత. హైదరాబాద్‌లోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అవుట్‌బౌండ్ ట్రాఫిక్ 70 శాతం తగ్గిందని నిర్ధారించారు. వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో ఫ్రీజ్ , వీసా తిరస్కరణ రేట్లలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడింది.
సాధారణంగా ఈ సమయానికి, చాలా మంది విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసి విమాన ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండాలి. కానీ ఇప్పటికి వీసా స్లాట్లు అందుబాటులోకి రావడం లేదు. వీసా స్లాట్‌లను దశలవారీగా విడుదల చేస్తామని యుఎస్ అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు. ఇది విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. స్లాట్‌లను బుక్ చేసుకోగలిగిన విద్యార్థులు కన్ఫర్మేషన్ పొందలేకపోతున్నారు. బుకింగ్‌లను నిర్ధారించకుండా స్లాట్‌లు తెరవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. అమెరికా విద్య అనిశ్చితంగా మారుతూంటంతో విద్యార్థులు విద్య కోసం ఇతర దేశాలను అన్వేషిస్తున్నారు, ఒక సంవత్సరం కోల్పోతే.. ఇబ్బంది అవుతుందని కొంత మంది దరఖాస్తులను ఉపసంహరించుకుంటున్నారు. జర్మనీ సహా ఇతర యూరప్ దేశాల్లో ప్రసిద్ధ యూనివర్శిటీల్లో అవకాశాలను వెదుక్కుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో స్లాట్‌లు విడుదల చేయకపోతే, వేలాది కలలు చెదిరిపోతాయి. మార్చి నాటికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లు పొందిన విద్యార్థులు ఇప్పుడు అసాధారణంగా తిరస్కరణకు గురవుతున్నారు. సాధారణంగా సజావుగా ఆమోదాలు పొందే చాలా మంది విద్యార్థులను తిప్పి పంపుతున్నారు. వారి సోషల్ మీడియా వెట్టింగ్ లో సమస్యలు లేకపోయినా సరే అకారణంగా రిజెక్ట్ చేస్తున్నారు.
US ఇమ్మిగ్రేషన్ , జాతీయత చట్టంలోని సెక్షన్ 214(b) వీసా తిరస్కరణలకు ఒక సాధారణ కారణం చూపిస్తారు. వారు వీసా గడువు ముగిసిన తర్వాత దేశానికి తిరిగి వస్తారని నిరూపించుకోలేకపోతే వీసా తిరస్కరిస్తారు. వీసా దరఖాస్తుదారులు అమెరికాకు లేదా అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశ్యం లేదని నిరూపించుకోవాల్సి ఉందని యూఎస్ ఎంబసి అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం భారతదేశం 3.3 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. ఈ సంఖ్య చైనా కంటే ఎక్కువ. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) డేటా ప్రకారం, జనవరి 1, 2024 నాటికి, 11.6 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్నారు. ఇక నుంచి ఎక్కువ మంది యూరప్ వైపు చూస్తున్నారు.