Rajamouli's SSMB29 Movie Shooting Update: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'SSMB29' కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా... ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆగస్టులో మళ్లీ షూటింగ్

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైంది. ఒడిశా, హైదరాబాద్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లపై కీలక సీన్స్ షూట్ చేశారు జక్కన్న. ఆ తర్వాత చిత్రీకరణకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా ఆగస్టులో మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీని కోసం రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నారు. 

మహేష్ బాబుపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కూడా ఇందులో భాగం కానున్నట్లు సమాచారం. ఈ సీన్స్ కోసం మహేష్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సీన్ మూవీకే హైలైట్ అని స్టోరీకి కీలకం అని సమాచారం.

లొకేషన్ ఛేంజ్

నిజానికి కొత్త షెడ్యూల్‌ను రాజమౌళి టీం ముందుగా కెన్యాలో ప్లాన్ చేశారు. అక్కడ నేచర్, ఎత్తైన కొండలకు ఫిదా అయిన జక్కన్న అక్కడే కీలక సీన్స్ తీయాలని అనుకున్నారట. అయితే, ప్రస్తుతం అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో షూటింగ్ చేయడం అంత సేఫ్ కాదని లొకేషన్ ఛేంజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం దక్షిణాఫ్రికా, టాంజానియాలో ప్రకృతి ప్రదేశాలు, ఎత్తైన కొండలను టీం పరిశీలిస్తోందట. అక్కడి ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత షెడ్యూల్ యూరప్‌లో ఉండే ఛాన్స్ ఉంది. 

Also Read: బతికే ఉన్నారా, వస్తున్నా... అరెస్టైన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ప్రణీత్ హనుమంతు

అసలు స్టోరీ ఏంటో?

రాజమౌళి, మహేష్ బాబు మూవీ ప్రాజెక్ట్ అనౌన్స్ వచ్చినప్పటి నుంచీ ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. హాలీవుడ్ రేంజ్‌లో ఓ విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్‌లో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రామాయణం'లోని సంజీవని శోధన మూవీకి సెంటర్ పాయింట్ అని సమాచారం. భారీ డైనోసార్స్ మహేష్ వెంట పడే యాక్షన్ సీన్ మూవీకే హైలైట్ అని... ఇదివరకూ తెలుగు సినిమాలో ఎవరూ చేయని సీక్వెన్స్ అనే టాక్ వినిపిస్తోంది. 

సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణన్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... 2027లో మూవీ రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది.