Civils Topper Aditya Srivastava: దేశంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్ష అంటే యూపీఎస్సీ సివిల్స్ పేరు చెబుతారు. లక్షల మంది పోటీ పడితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను దాటుకుని ఐఏఎస్ అధికారులుగా ప్రతి ఏటా వందల మాత్రమే కొలువులు దక్కించుకుంటారు. అలాంటి కఠినతర పరీక్షలో ఫస్ట్ ర్యాంకర్ గా సత్తా చాటారు ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ (Aditya Srivastava). కార్పొరేట్ కొలువు వదిలి.. మూడో ప్రయత్నంలో ఏకంగా ఆలిండియా తొలి ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలో ఎదురుదెబ్బలు తగిలినా అనంతరం తప్పులు సరిదిద్దుకొని అనంతరం ఐపీఎస్ కు ఎంపికయ్యారు. పక్కా ప్రణాళికతో చదివి మూడో ప్రయత్నంలో ఐఏఎస్ టాపర్ గా నిలిచి ఆదర్శంగా నిలిచారు.
'గోల్డ్ మన్ శాక్స్'లో కొలువు వదిలి
ఆదిత్య శ్రీవాస్తవ ఐఐటీ కాన్పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ 'గోల్డ్ మన్ శాక్స్' (Goldman Sachhs)లో కొలువు సాధించారు. 2019లో బెంగుళూరులో ఉద్యోగ జీవితం మొదలుపెట్టిన ఆయన నెలకు రూ.2.50 లక్షల వేతనం అందుకున్నారు. అనంతరం 15 నెలలకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లక్నో చేరి ఉద్యోగానికి సిద్ధమయ్యారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక భద్రత సాధించాలనే ఆలోచనతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరానని, అయితే డబ్బు మాత్రమే అంతిమ ప్రేరణ కాదని గ్రహించి సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆదిత్య తెలిపారు. అట్టడుగు స్థాయిలో ప్రభావం చూపడానికి, వ్యవస్థకు తన వంతు సహకారాన్ని అందించడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. కాగా, గోల్డ్ మన్ శాక్స్ అనేది అమెరికన్ బహుళ జాతి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది.
2021లో తొలి ప్రయత్నంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం తప్పులు సరిదిద్దుకుని 2022లో యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 236వ ర్యాంక్ సాధించిన శ్రీవాస్తవ ఐపీఎస్ కు ఎంపికయ్యారు. అయితే, ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో మూడోసారి 2023లో సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ తో సత్తా చాటారు.
'తొలి కర్తవ్యం అదే'
'గోల్డ్ మన్ శాక్స్ లో పని చేసిన వారెవరో గుర్తు ఉండదు. కానీ టీఎన్ శేషన్ ఎవరో అందరికీ తెలుసు'. అని శ్రీవాస్తవ ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చారు. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం, ప్రభుత్వం అమలు చేసే పథకాలను వారికి అందించడం సివిల్స్ సర్వీసెస్ తోనే సాధ్యమని అన్నారు. గతంలో ప్రిపరేషన్ లో చేసిన తప్పులను సరిదిద్దుకుని ప్రిపేర్ అయినట్లు చెప్పారు. ఐఏఎస్ గా తన తొలి పని ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను తన సామర్థ్యం మేరకు అమలు చేస్తానని స్పష్టం చేశారు. ఆదిత్య శ్రీవాస్తవ తండ్రి అజయ్ శ్రీవాస్తవ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆదిత్య ఇంటర్‌లో 95 శాతం మార్కులు సాధించారు.
Also Read: Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, భారీగా ప్లాన్ చేసిన మస్క్ మామ