UGC Latest decision: ఉన్న‌త విద్య‌ను(Higher Education Inistitutions) అభ్య‌సించాల‌నేది చాలా మంది విద్యార్థుల క‌ల‌. ఎం.ఏ.(M.A). ఎం.కామ్(M.Com), BBA, MSc.. స‌హా అనేక ఇత‌ర కోర్సుల్లోనూ చేరాల‌ని.. త‌మ జీవితాల‌ను మ‌రింత మెరుగు పరుచుకోవాల‌ని భావిస్తారు. వీరిలో సాధార‌ణ విద్యార్థుల‌తోపాటు.. ఎక్కువ మంది ఒక‌వైపు ప‌నిచేసుకుంటూ.. మ‌రోవైపు విద్య‌ను అభ్య‌సించాల‌ని అనుకునే వారు కూడా ఉన్నారు. అది కూడా.. రెగ్యుల‌ర్‌(Regular)గా విద్యాసంస్థ‌ల‌కు వెళ్లి చ‌ద‌వాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా ఉంటున్నారు.


ప్రస్తుతం ఏడాదికి ఒక్కసారి అడ్మిషన్లు 
ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ప్ర‌కారం.. ఏడాది(Yearly)కి ఒక్క‌సారి మాత్రం ఆయా విద్యాసంస్థ‌లు అడ్మిష‌న్లు ఇస్తున్నాయి. ఎంట్ర‌న్స్ ఎగ్జామ్(Entrance Exam) నిర్వ‌హించి.. జూలై-ఆగ‌స్టు మాసాల మ‌ధ్య అడ్మిష‌న్ల‌ను కొన‌సాగిస్తున్నాయి. అయితే.. ఏదైనా కార‌ణంతో ఈ స‌మ‌యంలో చేరేందుకు కుద‌ర‌ని వారు మ‌ళ్లీ అడ్మిష‌న్ పొందాలంటే.. ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వ‌స్తోంది. ఫ‌లితంగా అత్యంత విలువైన విద్యా సంవత్స‌రాన్ని వారు కోల్పోతున్నారు. అంతేకాదు.. కొంద‌రిలో అయితే.. బాధ్య‌త‌లు పెరిగి.. మ‌రుస‌టి విద్యా సంవ‌త్స‌రం వ‌ర‌కు వేచి చూసే అవ‌కాశం లేక‌.. ఇక‌, ఆ ప్ర‌తిపాద‌న‌ను కూడా విమ‌రించుకుంటున్న‌వారు ఉన్నారు. 


ఈ స‌మ‌స్య‌పై దేశ‌వ్యాప్తంగా అనేక మంది కొన్ని సంవ‌త్స‌రాల నుంచి గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు. విద్యా ర్థి సంఘాల నాయ‌కులు కూడా ఈ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గ‌త రెండేళ్లుగా ఉన్న‌త విద్యకు సంబంధించి కేంద్రం స్థాయిలోనూ.. ఈ స‌మ‌స్య‌పై చ‌ర్చ సాగుతోంది. దీనిని అధ్య‌య‌నం చేసిన యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్‌(UGC) అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించాల‌నే దృక్ఫ‌థంతో నూత‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఏడాదికి ఒక్కసారే అడ్మిష‌న్లు క‌ల్పిస్తున్న నేప‌థ్యంలో ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఉన్న‌త విద్య‌కు దూర‌మ‌వుతున్నార‌ని.. అవ‌కాశం ల‌భించ‌ని వారు ఏడాది పాటు వేచి ఉండేందుకు ఇబ్బంది ప‌డుతున్నార‌ని గుర్తించింది. దీంతో గ‌త ఏడాది కిందటే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం.. ఆన్‌లైన్‌లో విద్య‌ను అభ్య‌సించేవారికి, డిస్టెన్ మాధ్య‌మంలో విద్య‌ను కోరుకునేవారికి.. ఏటా రెండు సార్లు అడ్మిష‌న్లు క‌ల్పించేలా.. అనుమ‌తి ఇచ్చింది. 


ఫ‌లితంగా 2023-24 విద్యాసంవ‌త్స‌రంలోనే ఆన్‌లైన్(Online), డిస్టెన్స్(Distance) మాధ్య‌మాల్లో విద్య‌ను అభ్య‌సించే వారికి ఏడాదికి రెండు సార్లు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఒక‌టి జ‌న‌వ‌రిలోను, రెండోసారి ఆగస్టులోనూ అవ‌కాశం ఇస్తున్నారు. దీంతో ఈ రెండు స‌మ‌యాల్లో ఎప్పుడైనా అభ్య‌ర్థులు ఉన్న‌త విద్యాకోర్సుల్లో చేరేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఫ‌లితంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో విద్యార్థుల‌కు మేలు జ‌రిగిన‌ట్టు యూజీసీ పేర్కొంది. యూజీసీ లెక్క‌ల ప్ర‌కారం.. ఈ ఒక్క ఏడాదే 4 ల‌క్ష‌ల పైచిలుకు విద్యార్థులు రెండు ద‌ఫాలుగా అడ్మిష‌న్లు పొందారు. దీంతో వారి క‌ల‌లు నెర‌వేర్చుకునే అవ‌కాశం దొరికింది. ఇక‌, ఇప్పుడు యూజీసీ మ‌రో తాజా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యుల‌ర్ విధానంలో చేరేందుకు ఏడాదికి రెండుసార్లు అవ‌కాశం క‌ల్పించేందుకు అనుమ‌తి ఇచ్చింది. రెగ్యులర్‌ విధానంలో(అంటే.. కాలేజీలు లేదా వ‌ర్సిటీల‌కు వెళ్లి చ‌దివే విధానం) కోర్సులు సాగించే యూనివర్సిటీలు, కాలేజీల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. 


ఎప్ప‌టి నుంచి.. 


తాజాగా యూజీసీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు.. ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రం(2024-25) నుంచే ఈ అవ‌కాశం విద్యార్థుల‌కు అంద‌నుంది. ఈ విద్యాసంవ‌త్స‌రంలో జనవరి లేదా ఫిబ్రవరి, జూలై లేదా ఆగస్టు నెలల్లో విద్యార్థులకు  అడ్మిషన్లు క‌ల్పించ‌నున్నారు. ఈ మేర‌కు యూజీసీ విధాన నిర్ణాయక మండలి దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించింది. 


ప్రస్తుత విధానం మేర‌కు యూనివర్సిటీలు, కాలేజీలు ఏటా జూలై-ఆగస్టు మధ్య రెగ్యులర్‌ విధానంలో విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పిస్తున్నాయి. ఇక నుంచి ఏటా రెండు సార్లు అడ్మిష‌న్లు క‌ల్పించ‌నున్నాయి. దీంతో ఏదైనా స‌మ‌స్య‌తో ఒక విడ‌త‌లో చేర‌లేక‌పోయిన విద్యార్థులు అదే సంవ‌త్స‌రంలో రెండో సారి క‌ల్పించే అడ్మిష‌న్ ద్వారా ఆయా విద్యా సంస్థ‌ల్లో చేరేందుకు అవ‌కాశం ఉంది. గత ఏడాది ఆన్‌లైన్‌ పద్ధతిలో ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానాలను ద్వైవార్షికంగా చేపట్టినప్పుడు సుమారు 9 ల‌క్ష‌ల మంది రెండు విడ‌త‌ల్లో ల‌బ్ది పొందారు. ఇప్పుడు రెగ్యుల‌ర్ విధానంలో మ‌రింత వెసులు బాటు క‌ల్పించ‌నున్నారు. 


ఎలా చేరాలి?


చాలా మంది రెగ్యుల‌ర్ విద్యార్థులు.. పోటీ ప‌రీక్ష‌లు రాస్తున్నారు. ఖ‌చ్చితంగా ఇదేస‌మ‌యంలో యూనివ‌ర్సిటీలు, ఇత‌ర కాలేజీల్లో ఉన్న‌త విద్య‌కు సంబంధించిన నోటిఫికేష‌న్లు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో పోటీ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు వాటి కోసం వేచి చూడాలా?  లేక‌.. యూనివ‌ర్సిటీలో చేరాలా? అనే సందేహాలు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క‌సారి వేచి చూడ‌డం కార‌ణంగా అటు పోటీ ప‌రీక్ష‌లో సీటు రాక‌.. ఇటు రెగ్యుల‌ర్ విధానంలోనూ స‌మ‌యం అయిపోవ‌డంతో ఇరుకున ప‌డి ఏడాది కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటివారి కోసం.. జూలై-ఆగ‌స్టుతోపాటు.. జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మాసాల మ‌ధ్య యూనివ‌ర్సిటీలు రెగ్య‌లర్ విధానంలో అడ్మిష‌న్లు చేప‌ట్ట‌నున్నాయి. సాధార‌ణ ప‌ద్ధ‌తిలోనే వీరు ఆయా విద్యాసంస్థ‌ల్లో అడ్మిష‌న్లు పొందేందుకు అవ‌కాశం ఉంది.