Draft UGC on UG, PG Admissions: ఉన్నత విద్యకు మరింత మెరుగులు దిద్దేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) శ్రీకారం చుట్టింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు, విద్యా సంవత్సరాలకు సంబంధించి విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చేందుకు యూజీసీ సమాయత్తమవుతోంది. ‘యూజీసీ (యూజీ, పీజీ డిగ్రీ కోర్సుల) రెగ్యులేషన్స్ - 2024’ సవరణ బిల్లులో ఇందుకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సంబంధిత పరీక్షలో పాసయ్యే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కోర్సులో చేరొచ్చనే నిబంధన ముసాయిదా బిల్లులో ఉందని తెలుస్తోంది. అమెరికా విద్యావ్యవస్థ తరహాలో ఏడాదిలో రెండుసార్లు (జులై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరి) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల వ్యవధిని పెంచడం, తగ్గించడం వంటి నిబంధనలు కూడా ముసాయిదాలో పొందుపరిచారు. సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసిన తర్వాత అందులోని నిబంధనలన్నీ అమల్లోకి వస్తాయి.
సవరణ బిల్లులో విప్లవాత్మక ప్రతిపాదనలు..
ఈ కొత్త నిబంధనలు చాలావరకు విదేశీ వర్సిటీల విద్యా విధానాలను పోలి ఉన్నాయి. విద్యార్థులు 12వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీలో ఏ సబ్జెక్టు అనేది సంబంధం లేకుండా డిగ్రీ, పీజీ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో లేదా వర్సిటీ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులకు తరగతి గది అంశాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ సంస్కరణల ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలను చేరుకునేలా చేస్తామని యూజీసీ చైర్‌పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.
'స్కిల్' సబ్జెక్టులకు 50 శాతం క్రెడిట్లు..
యూనివర్సిటీల్లో క్రెడిట్ల కేటాయింపు విధానంలోనూ మార్పులు చేశారు. ఇక నుంచి 50 శాతం క్రెడిట్లను ప్రధాన సబ్జెక్టులకు కేటాయిస్తారు. మిగతా 50 శాతం క్రెడిట్లను నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అప్రెంటిస్‌షిప్, ఇతర ఆసక్తి ఉన్న సబ్జెక్టుల నుంచి పొందవచ్చు. అదేవిధంగా ఒకేసారి రెండు డిగ్రీ లేదా పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంటుంది. డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు వీలు ఉంటుంది. ఇందుకోసం యాక్సెలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏడీపీ), ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఈడీపీ) విధానాలను ప్రవేశపెట్టనున్నారు.
ఆరు 'కేంద్ర' వర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు..
యూజీ, పీజీ కోర్సుల్లో ఇకపై ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించాలని దేశంలోని ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. వీటిలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్‌పూర్ యూనివర్సిటీ, నాగాలాండ్ యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించడానికి యూజీసీ నిర్ణయించడంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా యూనివర్సిటీల్లో ప్రతి ఏడాది జూలై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరి నెలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
రెండున్నరేళ్లలో డిగ్రీని పూర్తిచేసే వెసులుబాటు..
మూడేళ్ల డిగ్రీ కోర్సును రెండున్నర, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును మూడు సంవత్సరాల్లో పూర్తిచేయవచ్చు. ఇందుకోసం ఒకటి లేదా రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక.. యాక్సిలేటరీ డిగ్రీ ప్రోగ్రాం (ఏడీపీ)ను ఎంచుకోవచ్చు. 10 శాతం సీట్లకే ఈ అవకాశం లభిస్తుంది.
Draft UGC (Minimum Standards of Instruction for the Grant of UG and PG Degree) Regulations, 2024