➥ జూన్ నుంచి విద్యార్థినులకు ప్రత్యేక బస్సులు
➥ 50 మంది విద్యార్థినులకో బస్, వీరికి ప్రత్యేక బస్ పాస్
విద్యార్థినుల కోసం త్వరలో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. జూన్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం 100 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఏర్పాట్లపై గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో బస్ భవన్‌లో ఎండీ సజ్జనార్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.
విద్యార్థినుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుంచి శివారులోని విద్యాసంస్థల వరకు ప్రత్యేకంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలను సిద్దం చేస్తోందని చెప్పారు. విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన మేరకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది ఉదయం గమ్యస్థానానికి తీసుకెళ్లడం సాయంత్రం తిరిగి వారి ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది.
సామాన్యులకు భారం కాకూడదనే..
మహిళా కళాశాలలు సొంతంగా ఏర్పాటు చేస్తున్న బస్సుల్లో అధిక ఫీజులు ఉన్నందున కొంత మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ఇలా ప్రతి కళాశాల నుంచి వంద నుంచి రండు వందల విద్యార్థులు సొంతంగా వస్తున్నారని సంస్థ గుర్తించింది. సొంతంగా రవాణా వ్యవస్థ ఉన్న కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. అంత మొత్తం నగదును చెల్లించడం సామాన్యులకు భారంగా పరిణమిస్తోంది. షేర్ ఆటోల్లో ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించి కళాశాలలకు వెళ్తున్నారు.
ప్రత్యేక బస్ పాస్‌లు..
కేవలం విద్యార్థినుల కోసమే ఏర్పాటు చేయనున్న బస్సుల్లో ప్రయాణానికి ప్రత్యేక బస్ పాస్‌లను ఇవ్వనున్నారు. 50 మందికి ఒక బస్సు ఉండేలా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో ఆర్టీసీకి ఆదాయం సమకూరడంతో పాటు సురక్షితమైన ప్రయాణం అందించడానికి వీలవుతుంది. అందుకు కళాశాల దూరాన్ని బట్టి బస్సు టిక్కెట్ ధర ఆధారంగా నెలవారీ విద్యార్థులకు ప్రత్యేక పాస్‌ను సమకూర్చనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న విద్యార్థుల బస్సు పాస్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆ బస్సులో విద్యార్థినులే ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతి విద్యార్థి ఏడాదికి సుమారు రూ.20 వేలకు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తోంది.
డివిజన్ల వారీ నిర్ణయాలు..
వచ్చే విద్యా సంవత్సరానికి 500 బస్సులను టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ సిద్ధం చేస్తోంది కళాశాలల యాజమాన్యాలతో సంప్రదించి ప్రత్యేక బస్సులు నగరంలో అన్ని ప్రదేశాల నుంచి ఉండేలా చర్యలు తీసుకుంటోంది విద్యార్థినులను వారి ప్రదేశాల్లో వదిలేసిన తర్వాత అదే మార్గంలో ఇతర ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా ఎక్కువ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్రత్యేక బస్సులను నడిపే బాధ్యత అంతా డివిజనల్ మేనేజర్లకే అప్పగించనున్నారు. ఇది విజయవంతమై, ఆ తర్వాత దశలో విద్యార్థులు కళాశాలల యాజమాన్యాలు ముందుకొస్తే అందరికీ ప్రత్యేక బస్సులు సమకూర్చేట్లు సంస్థ భావిస్తోంది.