తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ (TSRJC) సెట్‌ పరీక్ష తేదీ ఖరారైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ పరీక్షను ఆగస్టు 14వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌.రమణ కుమార్‌ వెల్లడించారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షను 14న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ https://tsrjdc.cgg.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కోవిడ్ నిబంధనలతో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు రమణ కుమార్‌ పేర్కొన్నారు. కాగా, తెలంగాణలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ తొలి ఏడాదిలో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దీని ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ సహా పలు విభాగాల్లో చేరవచ్చు. 
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు ఆగస్టు 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 21న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీ సీట్లకు గానూ అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 
దోస్త్ గడువు 28 వరకు పెంపు.. 
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ) పరీక్ష మొదటి విడత రిజిస్ట్రేషన్‌ గడువును మరోసారి పొడిగించారు. జూలై 28 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుందని చెప్పారు. ఆగస్టు 4వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. రెండో విడత సీట్లను ఆగస్టు 25వ తేదీన కేటాయిస్తామని పేర్కొన్నారు. 
దోస్త్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్ ఒకేషనల్, బీకామ్ ఆనర్స్, బీఎస్ డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/  లేదా మీసేవ సెంటర్ లేదా టీ యాప్ ఫోలియా మొబైల్ యాప్ (T App Folio Mobile App) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.