TS LAWCET 2024 Schedule: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 27 లేదా 28 తేదీల్లో లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చి మొదటి వారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ శుక్రవారం (ఫిబ్రవరి 8న) విడుదలకానుంది. రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. 'టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్-2024 పరీక్షను జూన్ 3న నిర్వహించ‌నున్నారు. అదే విధంగా పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా అదేరోజు నిర్వహించ‌నున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌ల‌ను ఉస్మానియా యూనివ‌ర్సిటీ నిర్వహించ‌నుంది.

TS ECET 2024 Schedule: బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్‌ ఈసెట్‌' షెడ్యూల్‌ కూడా ఫిబ్రవరి 8న విడుదలకానుంది. శుక్రవారం లాసెట్‌, ఈసెట్‌ సెట్‌ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి 10న టీఎస్‌ ఐసెట్‌, టీఎస్ఎడ్‌సెడ్‌ షెడ్యూల్స్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 'టీఎస్ ఈసెట్' ప్రవేశ ప‌రీక్షను మే 6న నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జ‌ర‌గ‌నుంది. 

ఈఏపీసెట్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్ షెడ్యూలు ఫిబ్రవరి 6న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉన్నత విద్యామండ‌లి ఇటీవలే ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ హైదరాబాద్ పరీక్షలు నిర్వహించనుంది. 

ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జ‌ర‌గ‌నుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించ‌నుంది. 

➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఐసెట్' ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించ‌నున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జర‌గ‌నుంది. 

➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే 'టీఎస్ పీఈసెట్' ప‌రీక్షను జూన్ 10 నుంచి 13 మ‌ధ్య నిర్వహించ‌నున్నారు. శాతవాహ‌న యూనివ‌ర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. 

➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించ‌నున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.

తెలంగాణ సెట్ కన్వీనర్లు వీరే..

సెట్ పేరు నిర్వహణ యూనివర్సిటీ కన్వీనర్
టీఎస్ ఎప్‌సెట్(ఈఏపీసెట్)  జేఎన్టీయూహెచ్‌ ప్రొఫెసర్ దీన్ కుమార్​ 
టీఎస్ ఈసెట్  ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​
టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్​ విజయలక్ష్మి
టీఎస్ పీజీఈసెట్ జేఎన్టీయూహెచ్‌ అరుణ కుమారి
టీఎస్ ఐసెట్  కాకతీయ యూనివర్సిటీ నరసింహాచారి 
టీఎస్ పీఈసెట్ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ 
టీఎస్ ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మృణాళిని