TS ECET 2024 Results: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలను మే 20న విడుదల చేయనున్నారు. మే 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని ఈసెట్ కన్వీనర్ మే 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.


మే 6న టీఎస్ఈసెట్ పరీక్ష నిర్వహించారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఈసెట్ పరీక్ష కోసం మొత్తం 99 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 48, హైద‌రాబాద్ రిజీయ‌న్‌లో 44, ఏపీలో 7 ప‌రీక్షా కేంద్రాల‌్లో పరీక్ష నిర్వహించారు.  మొత్తం 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు).


తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్‌-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆలస్యరుసుములో ఏప్రిల్ 28 వరకు ద‌ర‌ఖాస్తుల‌ు స్వీక‌రించారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అవసరమైన వివరాలు సమర్పించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఈసెట్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​  ఈసెట్ కన్వీనర్​గా వ్యవహరిస్తున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.


Website


ALSO READ:


TS PGECET - 2024: టీఎస్ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూలులో మార్పులు, కొత్త తేదీలివే
టీఎస్ పీజీఈసెట్-2024 ప్రవేశపరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు సెట్ కన్వీన‌ర్ డాక్టర్ ఎ.అరుణ కుమారి శుక్రవారం (మే 17) ఒక ప్రక‌ట‌నలో తెలిపారు. రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్షతోపాటు జాతీయస్థాయిలో స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ ఉద్యోగ ప‌రీక్షల నేప‌థ్యంలో టీఎస్ పీజీఈసెట్ ప‌రీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు ఆయన వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 6 నుంచి 9 వ‌ర‌కు పీజీఈసెట్ ప‌రీక్షలు జ‌ర‌గాల్సి ఉండగా..  జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. అభ్యర్థులు ఈ మార్పును గ‌మ‌నించాల‌ని క‌న్వీన‌ర్ కోరారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల కొత్త షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..