TS POLYCET 2024 Postponed: తెలంగాణలో పాలిసెట్ 2024 వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS POLYCET)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. మే 24కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నాలుగో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడతలో మే 13న లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. మే 26న నామినేషన్ల పరిశీలన,  మే 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.


తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల ప్రారంభంకాలేదు. ఫిబ్రవరి 28 నుంచి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.300 తత్కాల్ ఫీజు కింద ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. 


ఈ ఏడాది మే 24న టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: polycet-te@telangana.gov.in లేదా 040 -23222192 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 






పాలిసెట్‌-2024 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.





వివరాలు..


* టీఎస్ పాలిసెట్ (TS POLYCET) 2024 నోటిఫికేషన్


అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్‌మెంట‌ల్‌ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


పరీక్ష విధానం..


➥ మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో లేదు.


➥ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.


వేర్వేరు ర్యాంకులు..


➥ పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. 


➥ పాలిటెక్నిక్‌ (టెక్నికల్‌): ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి


➥ అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ: అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–(60/2=30)–30, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.


అర్హత మార్కులు..


➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు,


➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 15.02.2024. (28.02.2024న ప్రారంభమైంది)


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.04.2024.


➥ రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.04.2024.


➥ రూ.300 తత్కాల్ ఫీజు కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 26.04.2024.


➥ పాలిసెట్ పరీక్ష తేది: 17.05.2024. (24.05.2024 కి మార్చారు)


➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 12 రోజుల్లో ఫలితాల వెల్లడి.


Notification


Registration


Website