తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్ ఫలితాలు ఆగస్టు 17న వెలువడ్డాయి. మధ్యాహ్నం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు సమర్పించి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జూలై 21, 22 తేదీల్లో జరిగిన విషయం తెల్సిందే. లాసెట్ మూడేళ్ల కోర్సు కోసం మొత్తం 24,938 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో పరీక్షకు 20,107 మంది హాజరయ్యారు. వీరిలో 74 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. లాసెట్ ఐదేళ్ల కోర్సు కోసం 7,506 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో పరీక్షకు 6,207 మంది హాజరయ్యారు. వీరిలో 68.57% మంది ఉత్తీర్ణత సాధించారు.ఇక పీజీఎల్‌సెట్‌కు 3,094 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో పరీక్షకు 2,607 మంది హాజరయ్యారు. వీరిలో 91.10% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మూడు విభాగాలకు మొత్తం 35538 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు మాత్రం 28921 మంది హాజరయ్యారు. మొత్తం 74.90% మంది ఉత్తీర్ణత సాధించారు.
TS LAWCET & PGLCET- 2022 RANK CARD
తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉస్మానియా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను జులై 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. జులై 26న ప్రాథమిక కీ విడుదల చేసి 28 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫలితాలతో పాటు ర్యాంకు కార్డులు, ఫైనల్ కీ కూడా విడుదల చేయనున్నారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.
క్వాలిఫై మార్కులు, ర్యాంకిగ్ విధానం ఇలా..
తెలంగాణ లాసెట్‌లో అర్హత సాధించాలంటే 35 శాతం కనీస మార్కులు తప్పనిసరి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 42 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశపరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమానమయ్యే అభ్యర్థులకు సెక్షన్-సిలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.
పీజీఎల్ సెట్‌లో అర్హత సాధించాలంటే 25 శాతం కనీసం మార్కులు తప్పనిసరి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 30 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమమయ్యే అభ్యర్థులకు పార్ట్-ఎలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమానమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా చేసుకుని తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.
TS LAWCET 2022 Notification