బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 26న తెలంగాణ ఎడ్‌సెట్ 2022 (TS EDCET 2022) నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఎడ్‌సెట్-2022 కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు సెషన్లలో నిర్వహించనున్న టీఎస్ ఎడ్‌సెట్ కు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఎడ్ సెట్ నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ కర్నూలు, విజయవాడలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మూడు సెషన్లలో ఎడ్‌సెట్..
ఈ ఏడాది తెలంగాణ ఎడ్‌సెట్‌కు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జూలై 26న పరీక్ష నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. తొలి సెషన్ ఉదయం 9.00 - 11.00 గంటల వరకు ఉంటుంది. 2వ సెషన్ మధ్యాహ్నం 12.30- మధ్యాహ్నం 2.30 గంటల వరకు, 3వ సెషన్ ఎగ్జామ్ సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నిర్వహించనున్నారు. మూడు సెషన్లలో కలిపి 38,091 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో సెషన్ 1కు 12,634 మంది అభ్యర్థులు హాజరు కానుండగా.. సెషన్ 2 పరీక్షకు 12,732 మంది, సెషన్ 3 పరీక్షకు 12,725 మంది ఎడ్‌సెట్ అభ్యర్థులు హాజరుకానున్నారు.
అభ్యర్థులు ఇవి తప్పనిసరిగా పాటించాలి..
కొవిడ్ ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు.
పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్ష ప్రారంభమైన తర్వాత వచ్చే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు ముఖానికి మాస్క్ ధరించాలని సూచించారు.
ఇప్పటివరకూ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://edcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
ఆ విద్యార్థులు అనర్హులు
తెలంగాణలో మొత్తం 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎడ్‌సెట్ రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సాధిస్తేచాలు. డిగ్రీ, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చని కన్వీనర్ రామకృష్ణ పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు బీఈడీ చేసేందుకు అనర్హులని వెల్లడించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.
తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ ఏప్రిల్‌లో విడుదలైంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించినట్లు కన్వీనర్ రామకృష్ణ వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించారు. లేట్ ఫీజు రూ.250తో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఏపీలో ఎడ్‌సెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
Also Read: JEE Main 2022 Postpone : చివరి క్షణంలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా - కొత్త తేదీలపైనా రాని క్లారిటీ !