తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ECET)- 2021 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు పాపిరెడ్డి తెలిపారు. ఈసెట్ అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


కాగా.. పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు గానూ ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్ ఈసెట్ పరీక్షను ఈ నెల 3వ తేదీన నిర్వహించారు. ఈసెట్ పరీక్షలకు మొత్తం 24,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 95.46 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 


ఫలితాలను చెక్ చేసుకోండిలా..



  • ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఇందులో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇచ్చి లాగిన్ అవ్వాలి. 

  • వ్యూ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేయండి.

  • ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.


ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..
తెలంగాణ ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. ఆగస్టు 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.


ఆగస్టు 26వ తేదీ నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పారు. వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 2వ తేదీన ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 7 వరకు ఆన్‌లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.


సెప్టెంబర్‌ 13 నుంచి తుది విడత.. 
ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. సెప్టెంబర్‌ 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించింది. వెబ్ ఆప్షన్లను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఇచ్చుకోవచ్చు. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబరు 17న ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు వెల్లడించారు. స్పాట్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 18వ తేదీన అవకాశం కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


Also Read: TS ECET Counselling: టీఎస్‌ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. వెబ్ ఆప్షన్ల తేదీలు, పూర్తి వివరాలు