Telangana ECET 2024 Results: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు (మే 20) వెలువడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
95.86 శాతం ఉత్తీర్ణత నమోదు..
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 6న నిర్వహించిన ఈ పరీక్ష కోసం మొత్తం 24,272 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 23,330 మంది పరీక్ష రాయగా.. 22,365 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బీఎస్సీ మాథ్స్ విభాగంలో పెద్దపల్లికి చెందిన యాదగిరి మొదటి ర్యాంక్ సాధించాడు. ఇక మీర్ ఐజాజ్ అలి రెండో ర్యాంక్ సాధించాడు. ఇక కెమికల్ ఇంజినీరింగ్‌లో విశాఖకు చెందిన బంక మనోహర్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఈసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాత్రి అభినందనలు తెలియజేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈసెట్ పరీక్షను మే 6న మొత్తం 99 కేంద్రాల‌్లో నిర్వహించారు ఇందులో తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 పరీక్షా కేంద్రాల‌్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు). పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకుల ఆధారంగా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఈసెట్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://ecet.tsche.ac.in
➥ అక్కడ హోంపేజిలోని కింది భాగంగో కనిపించే ''Download Rank Card'' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank card' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ విద్యార్థులు ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆలస్యరుసుములో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరిగింది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్ ఈసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.