తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. 1,47,991 మంది హాజరైతే 1,21,480 మంది క్వాలిఫై అయ్యారని పేర్కొన్నారు. అగ్రికల్చర్ విభాగంలో 92.48 శాతం మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. 79009 మంది హాజరవ్వగా 73070 మంది అర్హత సాధించారని చెప్పారు.


టాప్ 3 వీరే..


ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్తి కార్తికేయ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంకు వచ్చినట్లు మంత్రి సబితా తెలిపారు. రాజంపేట కడపకు చెందిన దుగ్గినేని వెంకట పణీశ్‌ కు రెండో ర్యాంకు, హైదరాబాద్ టోలిచౌకీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ముకీత్ అనే విద్యార్థికి మూడో ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. 


అగ్రికల్చర్ విభాగంలో తెలంగాణలోని బాలానగర్ కు చెందిన మండవ కార్తికేయకు మొదటి ర్యాంకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేటకు చెందిన ఇమాని శ్రీనిజ రెండో ర్యాంకు, హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన తేరుపల్లి సాయి కౌశల్‌రెడ్డి మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. 


Also Read: TS Eamcet counselling: మరో 5 రోజుల్లో టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ముఖ్యమైన తేదీలివే..


ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో చూడవచ్చు. కాగా, టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్షలు ఈ నెల 4, 5, 6 తేదీల్లో.. వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 9, 10 తేదీల్లో జరిగాయి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను 6 సెషన్లలో నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 89.71 శాతం మంది హాజరయ్యారు. 


ఎంసెట్ పరీక్షలకు మొత్తం 2,51,606 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 1,64,962 మంది.. మెడికల్, అగ్రికల్చర్ విభాగాలకు 86,644 మంది అప్లై చేసుకున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్‌ ఫలితాలను ప్రకటించినందున ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజిని తొలగించారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులను ఖరారు చేస్తారు. 


ఫలితాలు చెక్ చేసుకోండిలా.. 



  1. eamcet.tsche.ac.in లింక్‌ను తెరవండి. 

  2. టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయండి. 

  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి. 

  4. స్క్రీన్ పై ఫలితాలు కనిపిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి. 


30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్‌..


తెలంగాణలో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖరారు చేశారు. 



  • ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

  • ధ్రువపత్రాల పరిశీలన.. సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. 

  • సెప్టెంబరు 4 నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.

  • సెప్టెంబరు 15వ తేదీన ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

  • సెప్టెంబరు 15 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

  • రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. 


Also Read: TS EAMCET Toppers: టీఎస్ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల హవా.. టాప్ 10 ర్యాంకర్ల వివరాలు