TS DEECET 2023: తెలంగాణలో డీఈఈ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. జనవరి 5 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. డీఈఈసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబరు 20న అన్ని సర్కారు డైట్ కాలేజీల్లో అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు డిసెంబరు 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి డిసెంబరు 30న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 5లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
54 ప్రైవేట్ డీఈడీ కళాశాలలకు చెక్..
ప్రస్తుత విద్యా సంవత్సరం(2023-24)లో రెండేళ్ల డీఈడీ కోర్సు నిర్వహణకు కేవలం 45 ప్రైవేట్ కళాశాలలకే విద్యాశాఖ అనుమతి లభించింది. మొత్తం 54 కళాశాలలకు అనుమతి దక్కలేదు. అందులో కొన్ని కళాశాలలు తమకు ప్రవేశాలు వద్దని దరఖాస్తు చేసుకున్నాయని, కొన్నింటిలో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు లేకపోవడం వల్ల అనుమతి ఇవ్వలేదని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి తెలిపారు. ఫలితంగా 9 ప్రభుత్వ, 45 ప్రైవేట్ కళాశాలల్లోనే కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ కళాశాలల్లో 1250, ప్రైవేట్ కళాశాలల్లో 2,350 సీట్లున్నాయి.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➥ డీఈఈసెట్-2023 హాల్‌టికెట్
➥ డీఈఈసెట్-2023 ర్యాంకు కార్డు
➥ పదోతరగతి సర్టిఫికేట్లు
➥ ఇంటర్ సర్టిఫికేట్లు
➥ బోనఫైడ్ సర్టిఫికేట్లు
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్
➥ క్యాప్, PHC, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్/గేమ్స్ సర్టిఫికేట్లు
తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో డీఎడ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2023' కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల్లో ఆందోళన చెందారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు మేనేజ్‌మెంట్ కోటా కింద చేరాలనుకుంటున్న అభ్యర్థులు కన్వీనర్ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందించలేదు. సిబ్బంది సైతం కళాశాలల జాబితా పంపాలని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులను కోరారు. ఈ మొత్తం జాప్యానికి కారణం పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. నిరుడూ నెలల తరబడి జాప్యం తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించడంతో 20 కళాశాలలు ప్రవేశాలు చేపట్టలేదు. డిగ్రీ లేదా ఇతర కోర్సుల్లో చేరాలో.. డీఎడ్‌లో ప్రవేశాల కోసం ఆగాలో విద్యార్థులు తేల్చుకోలేకపోయారు. అయితే తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును విడుదల చేయండంతో కాస్త ఊరట లభించినట్లయింది.
విద్యార్థులు చాలా మంది కౌన్సెలింగ్ కోసం వేచిచూసి చివరకు ఇతర కోర్సుల్లో కూడా చేరారు. అయినా విద్యాశాఖ ఏమాత్రం స్పందించకుండా కాలయాపన చేసింది. తీరా ఇప్పుడు కౌన్సెలింగ్‌ను ప్రారంభించింది. ఆ కోర్సులో ఎంత మంది చేరతారన్నది వేచిచూడాలి. రాష్ట్రంలో 10 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 1,400 సీట్లుండగా, 62 ప్రైవేటు కాలేజీల్లో 3,350 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతంతో పోలిస్తే డీఎడ్ కోర్సు అందించే కళాశాలల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2016-17లో 212 కళాశాలలుండగా... నిరుడు 109కి తగ్గింది. డీఎడ్ కోర్సుతోపాటు డైట్ కళాశాలలపైనా విద్యాశాఖ గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలున్నాయి. కొన్నిచోట్ల కళాశాలల స్థలాలను రైతుబజార్ల నిర్వహణకు ఇస్తున్నారు. కొంతకాలంగా అధ్యాపకుల నియామకాలూ లేవు.