తెలంగాణలోని యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలకు నిర్దేశించిన 'కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2022' కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి విడత సీట్లను విద్యార్థులకు కేటాయించారు. మొత్తం 21,329 మంది తొలి విడతలో సీట్లు పొందారు. రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో కన్వీనర్ కోటా కింద 49,801 పీజీ సీట్లకు గాను మొత్తం 30,079 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో 21,329 మందికే సీట్లు దక్కాయి.


మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 31లోపు ఆన్‌లైన్ ద్వారా సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్న విద్యార్థులు సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేసి టీసీ మాత్రమే ఇస్తే సరిపోతుంది. విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలన కోసం మాత్రమే సంబంధిత కళాశాల మేనేజ్‌మెంట్‌కు చూపిస్తే సరిపోతుంది. త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనున్నారు.


సీపీగెట్ - 2022 మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..



తెలంగాణలోని యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన‌ సీపీజీఈటీ – 2022 ఫలితాలు సెప్టెంబరు 20న విడుదలైన సంగతి తెలిసిందే. సీపీగెట్ ఫలితాల్లో మొత్తం 94.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 57,262 మంది విద్యార్థులు హాజరుకాగా 54,050 మంది విద్యార్థులు అర్హత సాధించారు.


ఈ ఏడాది సీపీగెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 23 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 67,027 మంది దరఖాస్తు చేసుకోగా.. 57,262 మంది హాజరయ్యారు. మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న 320 కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.


ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లు సీపీజీఈటీ 2021 ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. 


 


ALSO READ


TS University Calender: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్, యూనివర్సిటీలకు కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌! షెడ్యూలు ఇదే!
తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించిన కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అక్టోబరు 26న విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూళ్లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్లయింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌, పీజీలోని 1, 3 సెమిస్టర్లకు సంబంధించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు. ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలంగాణ మహిళా యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ ఒకేసారి తరగతులు ప్రారంభంకానున్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ పరీక్షలు, సెమిస్టర్‌ పరీక్షలు కూడా ఒకేసారి నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఈ ఏడు యూనివర్సిటీల్లో వేర్వేరు అకాడమిక్‌ క్యాలెండర్లు అమలు చేసేవారు. దీనివల్ల ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో ఇబ్బందలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు కలిపి ఒకే క్యాలెండర్‌ రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కామన్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇప్పటికే అక్టోబరు 10 నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
డిగ్రీ, పీజీ కామన్ క్యాలెండర్ తేదీల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..