ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం 30,125 సీట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని అధికారులు ప్రకటించారు. తొలి విడతలో సీట్లు పొందిన 18 వేల మంది ఫీజు చెల్లించలేదు. అంతకు ముందు సీట్లు కేటాయించిన తర్వాత 12 వేల సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 82,666 సీట్లు ఉంటే అందులో మొదటి విడతలో 70,665 సీట్లను విద్యార్థులకు కేటాయించారు.


విద్యార్థులకు కేటాయించిన మొత్తం 70,665 సీట్లలో ఇప్పటి వరకు 52,541 మంది విద్యార్థులు మాత్రమే కళాశాలలకు వెళ్లి రిపోర్టింగ్‌ చేశారు. దీంతో 30,125 సీట్లు మిగిలే ఉన్నాయి. వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అనుబంధ కోర్సుల్లో భర్తీ అయిన సీట్లు పోనూ ఇంకా 16,009 సీట్లు మిగిలే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో 7528 సీట్లు, సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లో 5876 సీట్లు, ఇతర ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 712 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 24న కొత్తగా 3,614 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్లు నమోదు చేసుకున్నారని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. జులై 24న ఒక్కరోజే పాత అభ్యర్థులు మెరుగైన కళాశాల, కోర్సు కోసం 7,407 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. జులై 31న రెండో విడత సీట్లను కేటాయించనున్నారు.


పెరిగిన సీట్లు..
ఇప్పటికే అదనంగా 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు మరికొన్ని సీట్లను కూడా జతచేసింది. వరంగల్‌లోని వీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను లెవల్‌ ఛేంజ్‌ పేరిట ఇంజినీరింగ్‌ కళాశాలగా మార్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందులో బీటెక్‌ సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులు కొత్తగా చేరాయి. ఒక్కో దాంట్లో 60 సీట్లుంటాయి. మరో రెండు కళాశాలల్లో మూడు బ్రాంచీలకు జేఎన్‌టీయూహెచ్‌ అనుమతి ఇచ్చినందున వాటిని కూడా చేర్చారు. తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,971కి చేరినట్లయింది.


రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ జులై 24 – జులై 25: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).


➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌.


➥ జులై 24 – జులై 27: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ జులై 27: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ జులై 31: సీట్ల కేటాయింపు.


➥ జులై 31 – ఆగస్టు 2 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


➥ ఆగ‌స్టు 4: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్రమే).


➥ ఆగ‌స్టు 5: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు స‌ర్టిఫికెట్ వెరిఫికష‌న్‌. 


➥ ఆగ‌స్టు 4 - ఆగ‌స్టు 6 వరకు: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.


➥ ఆగ‌స్టు 6: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.


➥ ఆగ‌స్టు 9: సీట్ల కేటాయింపు.


➥ ఆగ‌స్టు 9 – ఆగ‌స్టు 11: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 10 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial