Just In





Inter Admissions: ఇంటర్ ప్రవేశాలు పాతపద్ధతిలోనే, ఈసారికి ఆన్‌లైన్ లేనట్లే!
Inter: తెలంగాణలో ఇంటర్‌లో విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావించినా వచ్చే విద్యా సంవత్సరంలో అది కష్టమని ఇంటర్‌బోర్డు నిర్ణయానికి వచ్చింది.

Inter Admissions: తెలంగాణలో ఈసారి కూడా పాతవిధానంలోనే ఇంటర్ ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ విధానం అమలు చేయాలంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక్కో కళాశాలకు ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు. దీంతో అది కష్టమని ఇంటర్‌బోర్డు నిర్ణయానికి వచ్చింది.
ఒకవేళ ప్రభుత్వం ఫీజులు నిర్ణయించినా తాము జేఈఈ, ఎప్‌సెట్, నీట్ తదితర పోటీపరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని, హాస్టళ్లు ఉన్నాయని, ఫీజులను ఎలా నిర్ణయించారంటూ కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్‌బోర్డు.. వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ధ్రువీకరించారు.
తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను దోస్త్ (DOST) విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇంటర్ ప్రవేశాలకు కూడా ఇదే తరహాలో 'జోస్ట్ (JOST)' ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ 2025 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. పదోతరగతిలో ఈ సారి గ్రేడింగ్ విధానం ఉండదు. గతంలో మాదిరిగానే మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నారు. ఆన్‌లైన్ అడ్మిషన్ల కోసమే మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. జోస్ట్ విధానంలో 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు జూనియర్ కళాశాలలను ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అలాగే మెరిట్ ఆధారంగానే సీట్లను కాలేజీలను కేటాయిస్తారు.
గడువులోగా అనుబంధ గుర్తింపు పూర్తిచేయాల్సిందే..
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 3న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఏప్రిల్ 4న ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందాకే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతితోపాటు, ఇప్పటికే నడుస్తున్న కాలేజీలకు గుర్తింపును ఇవ్వడంతోపాటు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే నాటికి అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది.
ఆలస్య రుసుములో జూన్ 8 వరకు అవకాశం..
సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ఏప్రిల్ 5 నుంచి మే 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆలస్య రుసుంతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. అయితే గృహ, వాణిజ్య సముదాయాల పరిధిలో నడుస్తున్న 217 ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై నిర్ణయాన్ని ప్రకటించలేదు. కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు..
➥ వ్యాలీడ్ బిల్డింగ్ ఓనర్‌షిప్/రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఆఫ్ కాలేజ్ బిల్డింగ్
➥ బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ సర్టిఫికేట్
➥ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్/ ఫైర్ NOC
➥ వ్యాలీడ్ ఎఫ్‌డీఆర్ (కార్పస్ ఫండ్)
➥ స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్
➥ శానిటరీ సర్టిఫికేట్
➥ టీచింగ్ స్టాఫ్ డాక్యుమెంట్లు
➥ ప్లే గ్రౌండ్ సంబంధిత డాక్యుమెంట్లు
ముఖ్యమైన తేదీలు..
➥ ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు అవకాశం: 04.05.2025.
➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11.05.2025.
➥ రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 18.05.2025.
➥ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.05.2025.
➥ రూ.15,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 01.06.2025.
➥ రూ.20,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 08.06.2025.