ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయలు తీసుకోనున్నారు. సీబీఎస్ఈ సిలబస్ రూట్‌లోనే విద్యావిధానం ఉండాలని భావిస్తున్నారు. అదే సమయంలో విద్యార్దులపై ఒత్తిడి తగ్గించేందుకు పదో తరగతి కామన్ పరీక్షలకు చెక్ పెట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇందులో భాగంగానే పలు ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్టుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సీబీఎస్ఈ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికప్పుడు సీబీఎస్ఈ సిలబస్ అమలు వ్యవహరం అంత ఈజీకాదు. ఇంగ్లీష్ మీడియం అమలుతో ఇప్పటికే విద్యార్దులు కొంత వరకు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యాశాఖలో మార్పులు తీసుకువచ్చే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు.


ఒత్తిడి లేని విద్య కావాలి
ఒత్తిడి లేని విద్యావిధానం అమలు చేయటమే ప్రధాన లక్ష్యంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు విద్యా శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహరంపై విద్యా శాఖలో పలు దఫాలుగా కీలకమైన చర్చలు జరిగాయని అంటున్నారు. విద్యావిధానంలో మార్పులు అంశం పై పూర్తి స్థాయిలో చర్చ నిర్వహించటం, అభిప్రాయాలు పరిగణంలోకి తీసుకోవటం చాలా కీలకం. అందుకే కాస్త ఆలస్యమైనా పకడ్బందీ విద్యా విధానంతో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు పడాలని భావిస్తున్నట్లుగా విద్యా శాఖలో కీలక అధికారి ఒకరు తెలిపారు.


ఆందోళనకరంగా మారిన ఆత్మహత్యలు
విద్యార్థుల్లో ఇప్పుడు ఆత్మహత్యల వ్యవహరం చాలా సీరియస్‌గా మారింది. ఒకప్పుడు ఉన్నత చదువుల్లో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులను చూశాం. ఇప్పుడు పదో తరగతి పరీక్షల భయంతో కూడా ముందుగానే విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వలన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగులుతుంది. 


ఇంటర్ పరీక్షల ఫలితాల తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. చదువు ఒత్తిడి ఒక వైపు, ఫెయిల్ అయితే ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు, కొడతారనే భయం మరోవైపు. వీటన్నింటికి మించి తోటి విద్యార్థుల్లో వెనకబడిపోయాం అనే ఫీలింగ్‌తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో వీటన్నింటకి కాలక్రమంలో చెక్ పెట్టాలని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే విద్యావిధానంలో మార్పులు అంశం పై చర్చకు తెర లేచిందని అంటున్నారు.


పదో తరగతికి చెక్....
విద్యా శాఖలో పదో తరగతి కామన్ పరీక్షలు అంటే చాలా కీలకం. ఒకప్పుడు ఏడో తరగతి ప్రీ కామన్ పరీక్షలు ఉండేవి. వాటిని కూడా తోలగించి పదో తరగతి కామన్ పరీక్షలను కీలకం చేశారు. జీవితంలో పదో తరగతి పరీక్షలు పాస్ అయితే చాలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కనీసం పదో తరగతి పాస్ చేయించాలని చాలా కష్టాలు పడుతుంటారు. పదో తరగతి పాస్ అయిన తరువాత లేదా ఫెయిల్ అయిన తరువాత ఆయా విద్యార్దులు అక్కడితో ఆగిపోవటం, వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలి పనులకు వెళ్లటం వంటివి చూస్తూనే ఉన్నాం. విద్యా శాఖ నిర్వహించిన కీలక సర్వేలో కూడా ఇవే వెలుగు చూశాయి.


దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీబీఎస్ఈ సిలబస్‌లో కూడా పదో తరగతి బోర్డ్ పరీక్షల్లో మార్పులు తీసుకురానున్నారు. పదో తరగతి బోర్డ్ స్థానంలో ప్లస్ టూ తరగతులను కలసి ఇంటర్ రెండో సంవత్సరంలో ప్లస్ టూ బోర్డ్ పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో అదే విధానం ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో అమలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.