TG TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET-2024) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సోమవారం(నవంబరు 4) విడుదల చేయనుంది. టెట్ ప్రకటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో నవంబు 4న నోటిఫికేషన్ జారీకానుంది. రాష్ట్రంలో ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రథమార్ధానికి సంబంధించి మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఇక ద్వితీయార్ధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబరు 4న విడుదల చేయనుంది. అయితే జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం పేర్కొంది.
సంక్రాంతి లోపా? ఆ తర్వాతా?
రాష్ట్రంలో గత మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలను దాదాపు 2.35 లక్షల మంది హాజరయ్యారు. అందులో 1.09 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కూడా పూర్తవడంతో.. ఈసారి టెట్ పరీక్ష రాసేవారి సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది. దీంతో టెట్ పరీక్షలను సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వీరు అర్హులు..
టెట్ అర్హతలకు సంబంధించి.. పేపర్-1కు డీఎడ్, పేపర్-2కు బీఎడ్ పూర్తయి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా...జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
గత టెట్‌లో..
టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.
అభ్యర్థులకు బంపరాఫర్..
టెట్-2024లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రేవంత్ సర్కార్ కల్పించింది .
ALSO READ:
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయించింది. నవంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు మొదలుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే కారణంగా కొన్ని రోజులు తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..