Telangana SSC Supplementary Results 2024: తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జూన్ 28) వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
సప్లిమెంటరీ ఫలితాల్లో 73.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వీరిలో 46,731 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 34,126 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 71.01 శాతం, బాలికలు 76.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 5.36 శాతం అధికంగా ఉత్తీర్ణత కావడం విశేషం. ఫలితాల్లో నిర్మల్ జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక వికారాబాద్ జిల్లా 42.14 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,08, 385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉండగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేశారు. ఫలితాలకు సంబంధించి మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులుకాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు పాఠశాలల్లో జీరో (సున్నా) ఉత్తీర్ణత శాతం నమోదైంది.
వెబ్‌సైట్‌లో ఏపీ 'టెన్త్' సప్లిమెంటరీ విద్యార్థుల మెమోలు..
ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 26న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..మొత్తం 67,115 మంది (62.21 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 59.99 శాతం ఉత్తీర్ణులుకాగా.. బాలికలు 65.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు వ్యక్తిగతంగా తమ రోల్ నెంబరు నమోదుచేసి మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ వివరాలతో స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల పట్ల సందేహాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 27 నుంచి జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజుగా చెల్లించాలి.
పదోతరగతి మార్కుల మెమోల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ( Telangana Horticultural University) రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 200 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉండగా.. అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో 80 సీట్లు ఉన్నాయి. అయితే మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకే కేటాయించనున్నారు. మిగతా 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..