TS Inter Admissions: తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశా ప్రక్రియ మే 9న ప్రారంభమైంది. పదోతరగతి ఉత్తీర్ణులై, ఇంటర్ ప్రవేశాలు కోరువారు మే 9 నుంచి మే 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఇంట‌ర్ కాలేజీల్లో సమర్పించవచ్చు. ప్రవేశాలు పొందినవారికి జూన్ 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 లోపు తొలిద‌శ అడ్మిష‌న్ల ప్రక్రియ పూర్తి చేయ‌నున్నారు. ఈ మేరకు ప్రవేశాల షెడ్యూలును ఇంటర్ బోర్డు మే 8న విడుదల చేసింది.


రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ, సహకార, గురుకుల, కేజీబీవీ, ఆర్‌జేసీ, మోడల్, కాంపొజిట్, ఒకేషనల్ తదితర జూనియర్ కళాశాలలన్నీ ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూలును పాటించాల్సి ఉంటుంది. కళాశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, కళాశాలల్లో బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవేశాల సమయంలో ప్రతి కళాశాల భవనం ప్రవేశద్వారం వద్ద.. మంజూరైన సెక్షన్లు, భర్తీచేసే సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలని, ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశారు.


ప్రవేశ పరీక్షలు పెట్టడానికి వీల్లేదు..
ఇంటర్మీడియట్‌లో చేరగోరే విద్యార్థులకు అడ్మిషన్‌ ఇచ్చే క్రమంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్‌కు బోర్డు నిర్ణయించిన విధంగా అడ్మిషన్లు చేపట్టాలని, సీలింగ్‌ దాటి చేపట్టకూడదు. ఈమేరకు బోర్డు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డు ఆదేశించింది. అదేవిధంగా ప్రైవేటు కాలేజీలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తే.. వాటిపై పబ్లిక్ పరీక్షల (మాల్‌ ప్రాక్టీస్, ఇతర అనైతిక చర్యల నిరోధక) నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


ఈ డాక్యుమెంట్లు అవసరం..
➥  ఇంట‌ర్‌లో ప్రవేశం కోసం విద్యార్థులు ఇంట‌ర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన పదోతరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు త‌ప్పనిస‌రిగా ద‌ర‌ఖాస్తుకు జ‌త‌ప‌ర‌చాలి. ప్రొవిజిన‌ల్ అడ్మిష‌న్ పూర్తయిన త‌ర్వాత క‌చ్చితంగా ఒరిజిన‌ల్ మెమోతో పాటు టీసీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప‌దోత‌ర‌గ‌తిలో వ‌చ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు క‌ల్పిస్తారు. 


➥ కళాశాలల్లో ప్రవేశాల సమయంలో నిర్దేశిత రిజర్వేషన్లు కల్పిస్తారు. ప్రవేశాలు పొందే ప్రతి విద్యార్థి విధిగా ఆధార్ సంఖ్యను పేర్కొనాలి. పదోతరగతి ఉత్తీర్ణత తర్వాత విరామంతో ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలనుకునే వారు స్థానిక, నివాస ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.


➥ పదోతరగతిలో జీపీఏ, అందులో సబ్జెక్ట్ వారీగా గ్రేడ్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోని ప్రవేశాలు కల్పించాలి. కళాశాలల్లో మంజూరైన ప్రతి సెక్షన్‌లో 88 మందిని చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు అవసరమయితే ఇంటర్ బోర్డు అనుమతి తీసుకోవాలి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానా విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తారు.


ఇంటర్ ప్రవేశ ప్రక్రియ షెడ్యూలు ఇలా.. 


➥ మే 9 నుంచి ప్రవేశ ప్రక్రియ ప్రారంభంకానుంది. కళాశాలల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. 


➥  మే 31 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.


➥ జూన్ 1న తరగతులు ప్రారంభం కానున్నాయి. 


➥  జూన్ 30 నాటికి మొదటి దశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది.


➥  మొదటి దశ ప్రవేశాలు పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.



తెలంగాణ ఇంటర్ అకడమిక్​ ఇయర్ (​2024-25) క్యాలెండర్ ​..


➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2024. 


➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2024.


➥ దసరా సెలవులు: 06.10.2024 - 13.10.2024.


➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 14.10.2023.


➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 18.11.2024 - 23.11.2024.


➥ సంక్రాంతి సెలవులు: 11.01.2025 - 16.01.2025.


➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2025.


➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 20.01.2025 - 25.01.2025.


➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2025 ఫిబ్రవరి రెండవ వారం నుండి.


➥  ఇంటర్ థియరీ పరీక్షలు: 2025 మార్చి మొదటి వారం నుండి.


➥ వేసవి సెలవులు: 30.03.2025 - 31.05.2025.


➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025 మే చివరి వారంలో


➥ 2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2025.


ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..