తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగ‌స్టు 1 నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ ప‌రీక్ష‌లు ఆగస్టు 10వ‌ర‌కు కొన‌సాగనున్నాయి. ఆయా తేదీల్లో ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వహించ‌నున్నారు.


గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు.. 
పరీక్ష సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు 55,662 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 204 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 040 23230942 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.


తెలంగాణ పదో త‌ర‌గ‌తి పరీక్షలను  మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. 


జూన్ 30న పదోతగరతి ఫలితాలు వెల్లడించారు. ఫ‌లితాల్లో బాలిక‌లు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి విజ‌య‌భేరి మోగించారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలిక‌ల‌దే పైచేయి. బాలిక‌లు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, బాలురు 46.21 శాతం పాస‌య్యారు. 3,007 పాఠ‌శాల‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠ‌శాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్షల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా టాప్‌గా నిలువగా.. 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.


అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్షల టైం టేబుల్ ఇదే:
ఆగ‌స్టు 1 – ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు 3 – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు 4 – మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు 5 – జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు 6 – సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2


TS Inter Supplementary Exams: తెలంగాణలో ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,34,329 మంది, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,13,267 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.