TS 10th Class 2024 Recounting/ Reverification: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ రూల్ నెంబరు లేదా హాల్‌టికెట్ వివరాలు నమోదుచేసి మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ప్రవేశాల సమయంలో ఈ షార్ట్ మెమోలు ఉపయోగపడతాయి. ఒరిజినల్ మెమోలను త్వరలోనే సంబంధిత పాఠశాలలకు చేరవేయనున్నారు. అయితే పదోతరగతి ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రూ.500 ఫీజు చెల్లించాలి. ఇక రీవెరిఫికేషన్, డూప్లికేట్‌ క్వశ్చన్ పేపర్స్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. మే 15 లోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాథ్యాయులతో సంతకం చేయించిన దరఖాస్తులో హాల్‌టికెట్లు జతపరిచి డీఈవో ఆఫీస్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మాత్రమే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. కొరియర్, పోస్టు చేసిన దరఖాస్తులు స్వీకరించేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. 


తెలంగాణ పదోతరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..



టెన్త్ ఫలితాల్లో బాలికలదే హవా..
తెలంగాణ పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు  హాజ‌రుకాగా.. 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. సున్నా ఫలితాలు వచ్చిన పాఠశాలలన్నీ ప్రైవేటు స్కూల్స్ కావడం గమనార్హం. ఫలితాల్లో 99.09 శాతంతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండోస్థానంలో, 98.27 శాతం ఉత్తీర్ణతతో సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక 65.10 ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది.


జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. దీనిప్రకారం జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలతో సంబంధం లేకుండా పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థులందరూ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరుకావాలని విద్యాశాఖ సూచించింది. విద్యార్థులు మే 16 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు.  


మెమోలపై 'పెన్' నెంబరు ముద్రణ.. 
ఈసారి విద్యార్థుల మార్కుల మెమోలపై వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ (OTR) తరహాలో తొలిసారిగా 11 అంకెల యూనిక్‌ ఐడీ 'పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు (పెన్‌)' ముద్రించింది. యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌ ద్వారా జనరేట్‌ అయిన ఈ నంబర్‌ను మెమోలపై ముద్రించారు. ఇప్పటివరకు పదోతరగతి మెమోలపై హాల్‌టికెట్‌ నంబర్‌ను మాత్రమే ముద్రిస్తున్నారు. పలు రకాల అంతర్గత సెక్యూరిటీ ఫీచర్లను చేర్చారు. ఇదివరకు సర్టిఫికెట్లు అసలువో.. నకిలీవో తెలుసుకోవాలంటే అధికారులు లోతైన పరిశీలన తర్వాతే తెలిసేది. కానిప్పుడు ‘పెన్‌’ నంబర్‌ ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...