TS SSC Exams: తెలంగాణలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు, హాజరుకానున్న 5.08 లక్షల విద్యార్థులు

Telangana SSC exams: తెలంగాణలో మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

Continues below advertisement

TS SSC Exams: తెలంగాణలో మార్చి 18 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉ న్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానుండగా..  మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఇప్పటికే అధికారులు పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్‌టికెట్లు, ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌ను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే..

Continues below advertisement

ఒక్క నిమిషం నిబంధన తొలగింపు..
అయితే ఈసారి పదోతరగతి పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధనను తొలగించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రాల్లోకి పంపించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షాసమయానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు. 

పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పొరపాట్లకు ఆస్కారమున్నదిక్కడే..
సహజంగా మొదటి భాష (తెలుగు) పరీక్ష రోజున ప్రశ్నపత్రాలు తారుమారయ్యే అవకాశం ఉంది. పదోతరగతి రెగ్యులర్‌ విద్యార్థులకు 10టీ, 02టీ కోడ్‌ ఉన్న పేపర్లకు 80 మార్కుల పరీక్ష ఉంటుంది. అదేరోజు కాంపొజిట్‌ కోర్సు తెలుగు విద్యార్థులకు 60 మార్కులకు 03టీ కోడ్‌ పేపర్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్ల పంపిణీ సమయంలో ఇన్విజిలేటర్లు గందరగోళానికి గురవుతున్నారు. తెలుగుతో పాటు ఊర్దూ విషయంలోనూ ఇదే తరహా గందరగోళం జరుగుతున్నది. దీనిని నివారించేందుకు కాంపోజిట్‌ ప్రశ్నపత్రాలను కలర్‌పేపర్‌పై ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. 

నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ఎగ్జామ్ సెంటర్లు..
తెలంగాణలో మార్చి 18 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది వాట్సాప్‌లో ప్రశ్నపత్రాలు హల్‌చల్ చేసిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్‌ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు. వీరు తమ సెల్‌ఫోన్లను పరీక్ష కేంద్రం వెలుపలే పెట్టాల్సి ఉంటుంది. పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్‌ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌చేస్తారు. పేపర్‌ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.  

సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు..
పరీక్షల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే 040 -23230942 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఇప్పటికే 12 మంది ఉన్నతాధికారులను జిల్లాస్థాయి అబ్జర్వర్లుగా నియమించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించగా, విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌చేసుకునే అవకాశాన్నిచ్చారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో పరీక్షాకేంద్రాల సమీప స్టేషన్‌ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డు నామినల్‌రోల్స్‌, ఫొటో అటెండెన్స్‌ షీట్లు జిల్లాలకు చేర్చగా, తాజా గా ఓఎమ్మార్‌, ప్రశ్నపత్రాలు, సమాధానాల రాసే పేపర్లు, బుక్‌లెట్‌లను జిల్లాలకు చేరవేసింది.

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
మార్చి 18 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్)
మార్చి 23 మ్యాథమెటిక్స్
మార్చి 26 ఫిజికల్ సైన్స్ 
మార్చి 28 బయాలజికల్ సైన్స్
మార్చి 30 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 2 ఓరియంటెల్ పేపర్-2

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola