NMMSE Exam: తెలంగాణలో రాష్ట్ర స్థాయి 'నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఎగ్జామినేషన్‌ (NMMSSE)' డిసెంబరు 10న జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 28,704 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.


NMMSE హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


రాత పరీక్ష:


➥ ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.


➥ మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.


➥ స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయి లో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. 


కనీస మార్కులు:
రెండు పరీక్ష(మ్యాట్, శాట్‌)ల్లో సగటున జనరల్‌ అభ్యర్థులకు 40శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది.ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తోంది.


రూ.12వేల స్కాలర్‌షిప్‌
➥ ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ /10+2 తత్సమాన తరగతి పూర్తిచేసే వరకు ఈ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.


➥ తొమ్మిదో తరగతి నుంచి పదోతరగతికి స్కాలర్‌షిప్‌ కొనసాగాలంటే.. అభ్యర్థి 55శాతం మార్కులతో ప్రమోట్‌ కావాలి. అలాగే పదోతరగతిలో 60శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 55శాతం మార్కులతో ప్రమోట్‌ అయితే రెండో సంవత్సరంలో స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌ రెన్యూవల్‌ చేసుకోవాలి.


ALSO READ:


సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కీలక ప్రకటన చేసింది. ఇకపై 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్, డిస్టింక్షన్‌ ప్రకటించబోమని తెలిపింది. వీటితోపాటు మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని స్పష్టంచేసింది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో మార్కుల శాతాన్ని గణించే విధానం గురించి తెలియజేయాలంటూ కొందరు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సీబీఎస్‌ఈ ఈ విధంగా స్పందించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..