Medical PG Admissions: తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్థానికత నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశాలు పొందిన వారే.. పీజీలోనూ స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులు అని కోర్టు స్పష్టంచేసింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన పీజీలో స్థానిక కోటా వర్తించదంటూ తెచ్చిన జీవో 148, 149లను హైకోర్టు కొట్టివేసింది. 


తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్‌ఎంఎస్/బీఏఎంఎస్ చేసినవారికి ఇకపై పీజీలో స్థానిక కోటా పరిధిలోనే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. అదేవిధంగా తెలంగాణలో స్థానికులై ఉండి.. రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చదివిలన, ఇన్ సర్వీసు(తెలంగాణలో సివిల్ సర్జన్లుగా చేస్తున్న) అభ్యర్థులకు సైతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.


అసలేం జరిగిందంటే?
2021 పీజీ మెడికల్ ప్రవేశాల నిబంధన 8కి సవరణ చేసి ఈ ఏడాది అక్టోబరు 28న ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 148, 149లను సవాలు చేస్తూ హైకోర్టులో 90కిపైగా పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ప్రస్తుత పిటిషనర్లలో దాదాపు అందరూ ఏపీ, రాజస్థాన్‌లలో ఎంబీబీఎస్ పూర్తిచేసినవారే ఉన్నారు. వీరితోపాటు చైనా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి తెలంగాణలో ఇన్ సర్వీస్ అభ్యర్థులుగా సేవలందించినవారు కూడా.. తమను స్థానిక కోటా కింద తిరస్కరించడంపై పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి తాజాగా 106 పేజీల తీర్పును వెలువరించింది. 


రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయి.. 
రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కానీ.. మార్చాలని కానీ రాష్ట్రపతిని ప్రభుత్వం కోరలేదు. ఈ క్రమంలో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 మేరకు.. తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న వాదన అంగీకారయోగ్యం కాదు. ఆ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వం అన్వయించుకోలేదనే వాదన సరికాదు. అందువల్ల చదువులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్రానికి వర్తిస్తాయి. 


స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చు.. 
స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్న విధానం పూర్తిగా తొలగించాల్సింది కాదు. పీజీ కోర్సుల్లో స్థానికత ఆధారంగా ప్రవేశాలు కల్పించే వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. నాన్-లోకల్ కేటగిరీలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌లో చేరినవారు స్థానిక కోటా కింద పీజీలో ప్రవేశాలకు అర్హులుకాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 నుంచి ఇంటర్ వరకు రాష్ట్రంలో చదివినవారికే స్థానిక కోటా కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు లభిస్తాయి. వారికే పీజీ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద అర్హత లభిస్తుందన్న వాదన చట్టవిరుద్ధం. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు స్థానికంగా చదువుకున్నట్లయితే స్థానిక అభ్యర్థిగా పరిగణించాలి. ప్రభుత్వ జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. రాష్ట్ర విద్యాసంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు సైతం విరుద్ధం. 2021 చట్టంలోని నిబంధన 8 ఇన్ సర్వీసు అభ్యర్థులకు పూర్తిస్థాయి నిషేధం కల్పించలేదు. ఇందులో నిబంధన 1, 6, 8ల మధ్య తేడాలేదు. ఒకసారి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను సవరించడం సరికాదు. ఈ కారణాలతో జీవో 148, 149లను కొట్టివేస్తున్నామని తీర్పులో ధర్మాసనం పేర్కొంది. 


సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం..
హైకోర్టు వెలువరించిన స్థానికత  తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వ జీవోలపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో రాష్ట్రంలో కాళోజీ వర్సిటీ పీజీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటివరకూ వెలువరించలేదు. విద్యార్థుల మెరిట్ జాబితా కూడా పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో పీజీ కౌన్సెలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను వివరణ కోరగా ఏజీ న్యాయ సలహాతో ముందుకెళ్తామని తెలిపారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...