Fee Reimbursement and Scholarships: తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 19 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ గడువు జనవరి 31తో ముగిసింది.
కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఆలస్యం కాగా, ఆయా ప్రవేశాల సమాచారం ప్రభుత్వానికి రావడంలో ఆలస్యమైంది. దీంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దాదాపు 5.5 లక్షల మంది ఉంటారని అంచనా. ఇప్పటికి 4.2 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం 4 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రెండేళ్లుగా ఫీజుల్లేవ్..
రాష్ట్రంలో ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్స్ కోసం ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ మరుసటి ఏడాదే ప్రభుత్వం బోధన ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తూ వస్తోంది. కరోనా అనంతరం చెల్లింపులు ఆలస్యం కావడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన, చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు కలిపి 2022-23 విద్యాసంవత్సరం నాటికే రూ.3250 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫీజుల విడుదల్లో ఆలస్యం, సంక్షేమ శాఖలు విడుదల చేసిన బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాల కోసం అప్పులు చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి వస్తోంది.
2022-23 విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన రూ.3250 కోట్లలో రూ.1250 కోట్లకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు ట్రెజరీలకు పంపించి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో నిధుల కొరత నెలకొంది. 2023-24 ఏడాదికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల డిమాండ్ దాదాపు రూ.2400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం కలిపితే వచ్చే మార్చి నాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.5650 కోట్లకు చేరుకోనున్నాయి.
ALSO READ:
టీఎస్ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..