TS EAMCET 2022 : తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల అయింది. ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) మంగళవారం ప్రకటించారు. ఎంసెట్(EAMCET) పరీక్షలు జులై 14, 15, 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. జులై 13న ఈసెట్‌, జులై 14, 15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 18, 19, 20వ తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 


105 పరీక్షా కేంద్రాల్లో 


తెలంగాణ ఎంసెట్(EAMCET) షెడ్యూల్ ను మంగళవారం విడుదల అయింది. ఈ ఏడాది జూలై 14 నుంచి 20వ తేదీ వరకు 28 రీజనల్ సెంటర్స్ లో 105 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఐఐటీ జేఈఈ(IIT JEE) ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదల అయింది. దీంతో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ లలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు ఈ నెల మొదటి వారంలో ఉన్నత విద్యా మండలి భేటీ అయింది. ఎంసెట్ నిర్వహణపై చర్చించింది. ఈ నెల 14వ తేదీనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించింది కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు.  ఐఐటీ జేఈఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మే నెలలో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 


ఇంటర్ మార్కుల వెయిటేజ్


ఎంసెట్‌ పరీక్ష పూర్తైన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల(Inter Marks) వెయిటేజ్‌ కలిపేవారు. కానీ ఈసారి  ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 


45 రోజుల వ్యవధి ఆనవాయితీ 


 మే 6వ తేదీ నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు మే 24తో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉన్నందున ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహిస్తున్నారు.