తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం (మే 10) ప్రారంభమయ్యాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజైన మే 10న అగ్రికల్చర్ కోర్సులకు రెండు విడుతల్లో ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొదటిరోజు మొత్తం 57,577 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో ఉదయం విడతలో తెలంగాణ నుంచి 23,486 మంది, ఏపీ నుంచి 5,199 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో తెలంగాణ నుంచి 23,691 మంది, ఏపీ నుంచి 5,201 మంది రాస్తున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ బి. డీన్ కుమార్ విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
పరీక్షలకు ఏరోజు ఎంతమంది?
పరీక్ష తేదీ | విద్యార్థుల సంఖ్య |
మే 10 | 57,577 |
మే 11 | 57,754 |
మే 12 | 68,748 |
మే 13 | 69,017 |
మే 14 | 67,588 |
ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఆన్‌లైన్ పరీక్షలైనందున అన్ని చోట్లా కంప్యూటర్లు సక్రమంగా పనిచేసేలా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
తెలంగాణ ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ పరిశీలకుడిని నియమించారు. మే 10 నుంచి ఎంసెట్ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ పరీక్ష పర్యవేక్షణకు గతంలో రెండు నుంచి అయిదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ పరిశీలకుడు ఉండగా.. ఈ సారి సిట్టింగ్ స్క్వాడ్ తరహాలో పనిచేసేలా ప్రతి సెంటర్‌కూ ఓ పరిశీలకుడు ఉండనున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎంసెట్ రెండు విభాగాలకు కలిపి 54 వేల వరకు దరఖాస్తులు పెరిగాయి. ఇంజినీరింగ్‌కు 29 పరీక్షా కేంద్రాలు పెంచారు.
గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు..
ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా సమయానికే ఒక గంట ముందుగానే చేరుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ హాల్‌టికెట్‌పై పొందుపరిచిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు కేటాయించిన తేదీ, సమయంలోనే పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. ఆ సమయానికి అటెండ్ కాకపోతే.. ఇతర సెషన్లకు అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read:
జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..