తెలంగాణలో త్వరలో జరుగనున్న పదోతరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారుల‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబరు 13న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.


రాష్ట్రంలో గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ఆయ‌న‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, విద్యా శాఖ కమిషనర్ దేవసేన పాల్గొన్నారు.


రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.


TSPSCని ప్రక్షాళన చేయాలి: సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్ పీఎస్సీ)ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబరు 13న సచివాయంలో ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ(TSPSC), ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలను అత్యంత పారదర్శకంగా.. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న UPSCతో సహా పలు రాష్ట్రాలకు అధికారుల బృందాన్ని పంపాలని సీఎం నిర్ణయించారు. UPSCతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పని తీరును అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు.


ALSO READ:


టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్ - అసలు ట్విస్ట్ ఏమిటంటే ?
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( TSPSC ) చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్టు ప్రచారం జరిగింది.  అయితే జనార్ధన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజ్ కి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించవద్దని రాష్ట్ర గవర్నర్ తమిళసై నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. డిసెంబరు 12న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొద్దిసేపటికే ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాకు ముందు బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.  ఆ తర్వాత గవర్నర్‌ తమిళిసైకి జనార్దన్‌ రెడ్డి రాజీనామా సమర్పించారు. 2021 మే నెలలో TSPSC ఛైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి నియమితులయ్యారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..