తెలంగాణలో ఇంజినీరింగ్ సహా పలు కోర్సుల ఫీజులను సవరించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించింది. ఈ ఏడాదికి పాత ఫీజుల వర్తింపు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 2022-23, 2023-24, 2024-25 మూడు విద్యాసంవత్సరాల ఫీజులను ఈ ఏడాదిలోనే సవరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కళాశాలల వారీగా ఫీజుల ఖరారుపై టీఏఎఫ్‌ఆర్‌సీ పునర్విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా టీఏఎఫ్‌ఆర్‌సీ ఆడిటర్లు.. కాలేజీలు సమర్పించిన నివేదికను పునఃపరిశీలిస్తున్నారు.
ఈ విద్యాసంవత్సరం ఫీజులను సవరించరాదని, పాత ఫీజులనే కొనసాగించాలని టీఏఎఫ్‌ఆర్‌సీ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాలేజీలు కోర్టుకెళ్లడంతో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఏఎఫ్‌ఆర్‌సీ తాజా నిర్ణయం తీసుకుంది. 2023-24 నుంచి కొత్త బ్లాక్ పీరియడ్ ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు మళ్లీ కళాశాలల వారీగా ఈ ఏడాది నవంబర్ నుంచి పునర్విచారణ చేపట్టాలి. ఇది వచ్చే ఏడాది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం పడుతుందని, దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురవుతారనే వాదనలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వం నుంచి కూడా ఇదే తరహా సంకేతాలు అందటంతో టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు మూడేండ్లకుగాను ఫీజుల సవరణకు కాలేజీల వారీగా పునర్విచారణ ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఫీజులపై విచారణను పూర్తిచేస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆయా ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఫీజులను ఖరారుచేస్తూ ప్రభుత్వం జీవోను జారీచేస్తుందని పేర్కొన్నారు. ఆయా ఫీజులు ఈ విద్యాసంవత్సరం కూడా అమలవుతాయని స్పష్టం చేశారు.
Also Read
APRJC: గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి 12న కౌన్సెలింగ్
గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఏపీఆర్ జేసీ సెట్‌లో అర్హత సాధించి, ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలో సీటు పొందని అభ్యర్థులకు సెప్టెంబర్ 12న కౌన్సెలింగ్ జరగనుంది. ఏపీఆర్ జేసీ సొసైటీ కార్యదర్శి నరసింహారావు సెప్టెంబర్ 8న ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుంటూరు, కర్నూలు, వాయల్పాడు మైనారిటీ కళాశాలల్లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ విభాగాల్లో ప్రవేశాల నిమిత్తం మైనారిటీ కోటాకు చెందిన అభ్యర్థులు సెట్ రాయకపోయినా కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రాంతంలో బాల, బాలికలు, రాయలసీమ ప్రాంతంలో బాలురు ఎమ్ఈసీ, సీజీటీ, ఈఈటీల్లో ప్రవేశానికిగానూ సెట్ రాయకపోయినా పాల్గొనవచ్చని వెల్లడించారు. ఇతర వివరాలకు http://aprs.apcfss.in
Also Read
DOST Admissions: దోస్త్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా, కొత్త తేదీ ఇదే!
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను అధికారులు వాయిదా వేశారు. సెప్టెంబరు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉండగా, ఆ రోజు గణేశ్ నిమజ్జనం కారణంగా 12కు వాయిదావేశారు. పీహెచ్, ఎన్‌సీసీ, క్యాప్, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 12న హాజరుకావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.