తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. బీసీ విద్యార్థుల ‘స్వదేశీ విద్యానిధి’ పథకాన్ని 2023-24 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 200 అత్యుత్తమ, ప్రఖ్యాత జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన రాష్ట్రానికి చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజులు చెల్లించనున్నారు. విద్యార్థులకు ఏటా రూ.2 లక్షలు లేదా కోర్సు ఫీజు ఈరెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అక్టోబరు 4న అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ప్రవేశం పొందితే బోధన ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్, నిట్, బిట్స్‌తోపాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ గుర్తింపు పొందిన అత్యుత్తమ విద్యాలయాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ట్యూషన్ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. అదే తరహాలో దేశంలోని అలాంటి విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకూ ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఇటీవలే నిర్ణయింయించిన ప్రభుత్వం దాని అమలుకు శ్రీకారం చుట్టింది. ఆయా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న ఒక్కో బీసీ విద్యార్థికి ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షల ఫీజు చొప్పున, సంబంధిత కోర్సు ముగిసేవరకూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బోధన ఫీజులు మంజూరవుతున్నా, రాష్ట్రేతర విద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజులు అందడం లేదని తెలిపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అర్హత కలిగిన విద్యాసంస్థల జాబితా, బోధన ఫీజులకు నమోదుకు ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలన్నీ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించింది.
బీసీ సంఘాల, విద్యార్థుల హర్షాతిరేకం
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ విద్యార్థుల ‘స్వదేశీ విద్యానిధి’ పథకం అమలు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో ప్రతి ఏటా రాష్ర్టానికి చెందిన సుమారు 5 వేల నుంచి 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశముంది. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివిధ బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయడంతోపాటు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ:
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..