తెలంగాణలోని విద్యా సంస్థల్లో భద్రత, రక్షణకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలు, యూనవర్సిటీల్లో సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్లబ్‌లు విద్యాశాఖ, పోలీసు విభాగాల పరిధిలో పనిచేస్తాయి. ఈ సేఫ్టీ క్లబ్‌లు లైంగికవేధింపులు, డ్రగ్స్‌, సైబర్‌ క్రైం, హాస్టల్‌ భద్రత, రవాణా భద్రత, ట్రాఫిక్‌, రహదారి భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, పోలీసు ఉన్నతాధికారులు, యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లతో కలిసి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత చర్యలకు సంబంధించి రూపొందించాల్సిన మార్గదర్శకాలపై డిసెంబరు 22న సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విద్యా సంస్థలు, చుట్టుపక్క ప్రదేశాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, కోచింగ్‌ సెంటర్లు తదితర ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టేందుకు, డ్రగ్స్‌ నియంత్రణ, సైబర్‌ క్రైంను నిరోధించేదుకుగాను గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు విద్యార్థులకు అవగాహనను కల్పించడంతో పాటు డ్రగ్స్‌, గంజాయి తీసుకునే విద్యార్థులపై నిఘా పెట్టనున్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. అందులో తల్లిదండ్రులు, అధ్యాపకులను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. 


విద్యాసంస్థల్లోని విద్యార్థినులకు భద్రతకు, సైబర్‌ క్రైమ్‌ను అరికట్టేందుకు వీలుగా ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు, మహిళా సెక్యూరిటీ సెల్‌, సైబర్‌ సెల్‌, కౌన్సెలింగ్‌ సిబ్బంది, మౌలికవసతులు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి సెమిస్టర్‌లో వీటిపైన ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు విద్యాశాఖ, పోలీసు శాఖలు కలిసి పనిచేయనున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు.


చట్టాల్లోనూ మార్పులు..
విద్యార్థులు లైంగిక వేధింపులు, డ్రగ్స్‌, సైబర్‌ క్రైం బారినపడకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్పు చేసి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి నూతన చట్టాన్ని తెచ్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉండేలా చర్యలు తీసుకొబోతున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్‌, సైబర్‌ క్రైం, ర్యాగింగ్‌ పేరుతో యూనివర్సిటీల్లో పోలీసుల ప్రమేయం ఉండడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.


Also Read:


టీఎస్‌సెట్‌-2022 షెడ్యూలు విడుదల, దరఖాస్తు ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 షెడ్యూలును ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసెంబరు 22న విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా టీఎస్ సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీఎస్ సెట్-2022 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..