జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 11న ఐఐటీ బాంబే విడుదల చేయనుంది. ఆ తేదీన ఉదయం 10 గంటలకు అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్ష ప్రశ్నపత్రాలను, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను (ఆన్సర్ షీట్) వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఆన్సర్ కీని సెప్టెంబరు 3న విడుదల చేశారు. సెప్టెంబరు 3న ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబరు 4న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం సెప్టెంబరు 11న ఫలితాలతోపాటు ఫైనల్ కీని విడుదల చేయనున్నారు.
ఫలితాల కోసం వెబ్‌సైట్: https://jeeadv.ac.in/
ఈ ఏడాది ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు జేఈఈ మెయిన్ లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.5 లక్షల మంది హాజరయ్యారు. ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాదాపు 15 వేల మందిలో 90 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్–2022 నిర్వహించింది.
Also Read: AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
అర్హత మార్కులు ఇవే?
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష స్థాయి కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.
11న ఫైనల్ కీ..
సెప్టెంబరు11న ఉదయం 10 గంటలకు ఫలితాలతోపాటు తుది కీని ప్రకటించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) అక్టోబర్ 18న నిర్వహిస్తారు. వీటి ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు.
Also Read: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
12 నుంచి కౌన్సెలింగ్
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) షెడ్యూలును ఐఐటీ బాంబే ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 11న వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. అయితే సెప్టెంబరు 20 వరకు అభ్యర్థులకు మాక్ కౌన్సెలింగ్ అందుబాటులో ఉంటుందని.. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఐఐటీ బాంబే తెలిపింది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. మొత్తం 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐఐటీ బాంబే విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
JoSAA కౌన్సెలింగ్ ఇలా..
♦ 1వ రౌండ్ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు
♦ 2వ రౌండ్: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు
♦ 3వ రౌండ్: అక్టోబరు 3 నుంచి 7 వరకు
♦ 4వ రౌండ్: అక్టోబరు 8 నుంచి 11 వరకు
♦ 5వ రౌండ్: అక్టోబరు 12 నుంచి 15 వరకు
♦ 6వ రౌండ్ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు.
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:
♦ 1వ రౌండ్ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
♦ 2వ రౌండ్: సెప్టెంబరు 28వ తేదీ
♦ 3వ రౌండ్: అక్టోబరు 3
♦ 4వ రౌండ్: 8వ తేదీ
♦ 5వ రౌండ్: 12వ తేదీ
♦ 6వ రౌండ్ (చివరి): అక్టోబరు 16న