Patanjali University in Haridwar | హరిద్వార్: నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా రంగంలో కొన్ని సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక అభ్యాస పద్ధతులతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హరిద్వార్‌లోని పతంజలి యూనివర్సిటీ అలాంటి వాటిలో ఒకటి. పతంజలి యోగపీఠ్ ట్రస్ట్ (Patanjali Yogpeeth Trust) ద్వారా నిర్వహిస్తున్న ఈ విశ్వవిద్యాలయం, గంగా నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని సమకాలీన విద్యతో మిళితం చేసే ఒక ప్రత్యేక నమూనాను యూనివర్సిటీ అందిస్తుంది.

పతంజలి విశ్వవిద్యాలయం ప్రకారం.. యోగా, ఆయుర్వేదం, సంస్కృతాన్ని ఆధునిక విజ్ఞానం, నిర్వహణ, సాంకేతికతతో అనుసంధానం చేయడమే వారి లక్ష్యం. విద్యార్థులకు కేవలం అకాడెమిక్స్‌లో మాత్రమే కాకుండా జీవిత నైపుణ్యాలు (Life Skills), విలువలు, శారీరక శ్రేయస్సులో కూడా శిక్షణ ఇస్తారు. కోర్సులలో BSc, BNYS (బాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్), యోగా సైన్స్, శారీరక విద్య, మనస్తత్వశాస్త్రం, సంస్కృతం (Sanskrit), చరిత్ర, సంగీతం వంటి సబ్జెక్టులను బోధించే PG డిప్లొమా కోర్సులు ఉన్నాయి. సాంప్రదాయ గురుకుల వ్యవస్థలో నిర్వహిస్తున్నప్పటికీ ఆధునిక కాలానికి తగ్గట్లుగా తరగతి గదుల్లో ప్రొజెక్టర్లు, ల్యాబ్‌లు, డిజిటల్ సాధనాలతో అమర్చబడి ఉన్నాయి.

సంస్కృతి, విజ్ఞానం, స్థిరత్వంపై దృష్టి

విద్యార్థులు తమ రోజును యోగా, ధ్యానం, శతకర్మ వంటి పురాతన ఆరోగ్య విధానాలతో ప్రారంభిస్తారు. ఇది విద్యార్థుల శారీరక , మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తరువాత, వారు కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక సబ్జెక్టుల క్లాసులకు విద్యార్థులు హాజరవుతారు. విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతి, విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన 10 విభాగాలు ఉన్నాయి. ఇటీవల ఆయుర్వేదంతో పాటు యోగా విద్యలో పరిశోధనలను ప్రోత్సహించడానికి రాజా శంకర్ షా విశ్వవిద్యాలయం, ఇతర సంస్థలతో అవగాహన ఒప్పందాలపై పతంజలి సంతకం చేసింది. ఇది విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. 

లైబ్రరీ, హాస్పిటల్, హోలిస్టిక్ క్యాంపస్ లైఫ్

పతంజలి విశ్వవిద్యాలయంలో 30 వేల కంటే ఎక్కువ పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఉంది. ఇది పురాతన సాహిత్యం నుంచి ఆధునిక సాంకేతికత వరకు ఎన్నో పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. దీని వైద్య సౌకర్యాలలో పంచకర్మ చికిత్సలు, ఆధునిక ల్యాబ్ పరీక్షలను అందించే పతంజలి ఆయుర్వేద హాస్పిటల్ (Patanjali Hospital) కూడా ఉంది. స్పోర్ట్స్ కోసం గ్రౌండ్లు, ఇక్కడి హాస్టల్స్, ధ్యాన కేంద్రాలు విద్యార్థుల పూర్తి జీవనశైలిని మార్చివేస్తాయి. ఇక్కడి విద్య తమకు కెరీర్‌కు మాత్రమే కాకుండా సమాజానికి అర్థవంతమైన సేవ చేయడానికి సిద్ధం చేస్తుందని చాలా మంది పతంజలి యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు.