Pariksha Pe Charcha 2024 Registration: పరీక్షల సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరానికి గాను 'పరీక్షా పే చర్చ' రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ డిసెంబరు 14న ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 12లోపు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు పరీక్షా పే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది.
''ప్రధాని మోదీతో మాట్లాడేందుకు అందరూ సమాయత్తమవ్వండి. విద్యార్థులు, తల్లిండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడటం వల్ల పిల్లలకు పరీక్షలంటే భయం పోగొట్టి.. వాటిని ఓ ఉత్సవంలా నిర్వహించేందుకు వీలుంటుంది''అని కేంద్ర విద్యాశాఖ ట్విటర్‌లో పోస్టు చేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాళ్లే నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే టీచర్ లాగిన్‌లోనైనా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. తాము ఏయే ప్రశ్నలు అడగదలచుకున్నారో.. 500 అక్షరాలకు మించకుండా ముందే చెప్పాల్సి ఉంటుంది. గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్నారు. 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక మనదేశానికి చెందిన 81వేల మందికి పైగా విద్యార్థులు, 11వేల మందికి పైగా ఉపాధ్యాయులు, 5వేల మందికి పైగా తల్లిదండ్రులు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ALSO READ:
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ- 2024) 10వ తరగతి & 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 02 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం ఉదయం 10:30 నుంచి మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...