ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పొడిగించారు. ఈ మేరకు విద్యాహక్కు చట్టం నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల యజమానులు, ఇటీవల ఎమ్మెల్సీలుగా గెలిచిన ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. గుర్తింపు గడువును మూడు నుంచి పదేళ్లకు పొడిగించాలని ఎమ్మెల్సీలు ఇచ్చిన వినతి మేరకు 8 ఏళ్లకు పొడిగించినట్లు వెల్లడించింది.
తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఏటా యాజమాన్యాలు స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఇందులో అగ్నిమాపక, శానిటరీ, ఆడిట్, తనిఖీల నివేదికలను అప్‌లోడ్ చేయాలి. ఏదైనా పాఠశాలలో మూడేళ్లు వరసగా 20 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత ఉంటే దాన్ని మూసివేయాలి. ఒక పాఠశాల ఐదేళ్లు వరసగా మూసేసి ఉంటే దాన్ని పునఃప్రారంభించేందుకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి పాఠశాల అడ్మినిస్ట్రేషన్, ఆడిట్ నివేదికలను సెప్టెంబరు 30లోపు సంబంధిత అధికారులకు సమర్పించాలి. పాఠశాల భవనం ఆరు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉంటే అగ్నిమాపకశాఖ అనుమతులు అవసరం లేదు. ఇసుక బకెట్, నీళ్ల బకెట్ లాంటి వాటిని తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అర్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Also Read:
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్!
ఏపీ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం (ఏప్రిల్ 21) తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో బొత్స మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని బొత్స చెప్పారు. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు చెప్పామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నామని.. సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని బొత్స తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 'నైట్ వాచ్‌మన్' పోస్టుల మార్గదర్శకాలు జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో ‘మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం 2020–21 నుంచి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో దశల వారీగా టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, కిచెన్ షెడ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..