NEET UG Revised Scorecard 2024 Out: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ యూజీ-2024 పరీక్షకు సంబంధించిన రివైజ్డ్ స్కోరుకార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జులై 25న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డులను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ వివరాలు లేదా ఫోన్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం పరీక్ష కేంద్రాలవారీగా నీట్ యూజీ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా స్కోరుకార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. 


నీట్ యూజీ రివైజ్డ్ స్కోరు కార్డులు ఇలా చూసుకోండి..
➨ నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్‌కార్డ్ కోసం విద్యార్థులు మొదట ఎన్టీఏ అధికారిక‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - exams.nta.ac.in/NEET 
➨ అక్కడ హోంపేజీలో కనిపించే 'Click Here for Revised Score Card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➨ విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ వివరాలు లేదా ఫోన్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి SUBMIT బటన్ మీద క్లిక్ చేయాలి.
➨విద్యార్థుల స్కోరు కార్డులు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శమిస్తాయి.
➨ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


నీట్ యూజీ స్కోరుకార్డుల కోసం క్లిక్ చేయండి..


నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీఏ సవరించిన ఫలితాలను విడుదల చేసింది. దీని ఫలితంగా మెరిట్ జాబితాలో పలు మార్పులు జరిగాయి. జులై 23న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ యూజీ -2024 స‌వరించిన తుది ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా రివైజ్డ్ స్కోరుకార్డులను ఎన్టీఏ విడుదల చేసింది.


విద్యార్థుల ఆందోళనల మధ్య సుప్రీం కోర్టు జోక్యంతో ఐఐటీ-ఢిల్లీ నిపుణుల కమిటీ ఆధారంగా, వివాదాస్పద ప్రశ్నకు ఒక సరైన ఎంపికను మాత్రమే ఆమోదించడం తప్పనిసరి చేసింది. నీట్ యూజీ సవరించిన స్కోర్‌కార్డ్ 2024లో ఈ సర్దుబాటు కార‌ణంగా ఇప్పుడు ఆమోదించబడిన సమాధానాన్ని ఎంచుకున్న దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావంతో టాప్ ర్యాంకర్లు సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.  ఈ నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. సవరించిన ఫలితాలను ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.


ఆ ప్రశ్నకు ఒక్కటే సమాధానం..
నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు సరైన సమాధానంపై ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ జులై 23న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కటేనని స్పష్టం చేసింది. సంబంధిత ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో నాలుగోది మాత్రమే సరైన సమాధానం అని ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ తేల్చిందని ధర్మాసనం తెలిపింది. ‘స్టేట్‌మెంట్‌ 1 కరెక్ట్‌.. స్టేట్‌మెంట్‌ 2 కరెక్ట్‌ కాదు’ అని ఆ నాలుగో ఆప్షన్‌ చెబుతున్నదని పేర్కొంది. ఎన్టీఏ కూడా 4వ ఆప్షన్‌నే సరైన సమాధానంగా ఆన్సర్‌ కీలో సవరించాలని తెలిపింది. ప్రశ్న నంబర్‌ 29కు నాలుగో ఆప్షన్‌ మాత్రమే సరైన సమాధానమని తేల్చింది. ఈ నేపథ్యంలోనే సవరించిన ఫలితాల్లో నాలుగు లక్షల మంది 5 మార్కులను కోల్పోవాల్సి వచ్చింది.


నీట్‌-యూజీ పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) జులై 23న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మళ్లి నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్న మాట వాస్తవమేనని.. అయితే దీనివల్ల కేవలం 155 మంది అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందారని కోర్టు తెలిపింది. ఈ కారణంగా మిగతా అభ్యర్థులందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన అసవరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం జులై 23న తీర్పు చెప్పింది. నీట్‌ పేపర్‌ లీకేజీ ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులు లబ్ధి పొందారని, ఆ లబ్ధిపొందిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..