NEET UG 2025 Answer Key: జాతీయస్థాయి మెడికల్ ప్రవేశపరీక్ష నీట్ యూజీ-2025 పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఆన్సర్ కీ, OMR రెస్పాన్స్ షీట్, ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు, ఒక్కో ప్రశ్నకు ₹200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు జూన్ 5న రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు.
దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 4న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 జాతయ భాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది నీట్ పరీక్ష కోసం మొత్తం 22.7 లక్షల మంది నమోదుచేసుకున్నారు. వీరిలో 20.8 లక్షల (91.4 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 5453 పరీక్ష కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. గతేడాది నీట్ పరీక్షకు 23 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈసారి మూడు లక్షల మేర తగ్గింది.
షెడ్యూల్ ప్రకారం జూన్ 14న నీట్ యూజీ ఫలితాలను ప్రకటించనున్నారు. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా.. దేశంలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది.