JEE Mains Exam Admitcard: జేఈఈ మెయిన్-2025 రెండో విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' మార్చి 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటీవలే పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో పేపర్-1 (బీఈ, బీటెక్‌) పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా.. ఏప్రిల్ 9న పేపర్‌-2ఎ (బీఆర్క్‌), పేపర్‌-2బి (బి ప్లానింగ్‌), పేపర్‌-2ఎ, 2బి (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ రెండింటికి) పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది.

Continues below advertisement

JEE Maian session2 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement

పరీక్ష విధానం..

➥పేపర్‌-1(బీటెక్, బీఈ) పరీక్షబీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్‌-ఎ 20 మార్కులు, సెక్షన్‌-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో  బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు. 

➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్షనిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి. 

➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు..తెలంగాణలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఏపీలో అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, మంగళగిరి, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం తదితర చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్‌ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.