Elon Musk Big Deal |  వాషింగ్టన్: బిలియనీర్‌, ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్‌మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ను విక్రయించారు. అంత మంచి ప్లాట్‌ఫాంను ఎలాన్ మస్క్ (Elon Musk) విక్రయించడం పిచ్చి పని అనుకుంటున్నారా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎలాన్ మస్క్ ఎక్స్ సంస్థను విక్రయించింది మరెవరికో కాదు. ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో నడుస్తున్న కృత్రిమ మేధ (AI) స్టార్టప్ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ (xAI)కే ఎక్స్ సంస్థను విక్రయించానంటూ ట్విస్ట్ ఇచ్చారు.

మస్క్ మామతో అలా ఉంటది మరి అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎక్స్ కంపెనీని ఎక్స్ఏఐకి 33 బిలియన్‌ డాలర్లకు అమ్మివేసినట్లు ఎలాన్ మస్క్‌ ప్రకటించారు. కాగా, ఎక్స్‌ఏఐ సంస్థ విలువను 80 బిలియన్‌ డాలర్లు అని ప్రకటించారు. మస్క్ ఏ పని చేసినా దానికి అర్థం, పరమార్థం ఉంటుందని వాదించే వారు సైతం ఉంటారు.

ఎలాన్ మస్క్ ప్రకటనలో ఏముందంటే..

‘xAIని రెండేళ్ల కిందట స్థాపించాను. ప్రపంచంలోని ఏఐ ల్యాబ్ లలో ఇది అతి వేగంగా డెవలప్ అయింది. డేటా సెంటర్ లను నిర్మించే స్థాయికి సంస్థ ఎదిగింది. సరికొత్త మోడల్స్ డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 

అదే విధంగా X అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఇందులో  600 మిలియన్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో నిజానిజాలు తెలుసుకునేందుకు నెటిజన్లు వినియోగిస్తున్న మాధ్యమం ఇదీ. గత రెండు సంవత్సరాలలో ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా మారింది. అద్భుతమైన భవిష్యత్ సాధించడానికి ఎన్నో సంస్థలకు కంపెనీ దోహదం చేసింది.

xAI, X సంస్థల ఫ్యూచర్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. దాంతో మేం అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూటింగ్, పంపిణీ, టాలెంట్ లను ఒకచోటకు చేర్చడానికి  అడుగులు వేస్తున్నాము. విక్రయం ద్వారా సంభవించే విలీనంతో xAI అధునాతన AI సామర్థ్యం నైపుణ్యాన్ని X భారీ పరిధితో అన్‌లాక్ చేస్తుంది. దాంతో యూజర్లకు వేగంగా వాస్తవాలు తెలుస్తాయి. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటా సెంటర్, కొత్త మోడల్స్ ఆవిష్కరణకు అవకాశం లభిస్తుంది. బిలియన్ల మంది యూజర్లకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మానవ పురోగతిని మరింత వేగవంతం చేసే వేదికను నిర్మించడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని’ ఎలాన్ మస్క్ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఇటీవల భారత ప్రభుత్వంపై ఆరోపణలు

 ఎక్స్ కర్ణాటక హైకోర్టులో భారత ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది.  చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని ఎక్స్ సంస్థ ఆరోపిస్తోంది.  ప్రభుత్వం ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని ఎక్స్ ప్రతినిధులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమ సంస్థకు ఉన్న సేఫ్టీని ప్రభావితం చేస్తున్నాయని పిటిషన్‌లో తెలిపింది.