Trending
CSIR UGC NET June 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జూన్ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
CSIR-UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 27 వరకు పొడిగించింది. మే 27న రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాలి.
Joint CSIR-UGC NET June 2024: దేశంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించిన 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' దరఖాస్తు ప్రక్రియ మే 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు మే 21తో ముగియాల్సి ఉండగా.. మే 27 వరకు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
అభ్యర్థులు మే 27న రాత్రి 11.50 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.1150 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.325 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తుల సవరణకు మే 29 నుంచి 31 వరకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 25 నుంచి 27 మధ్య CSIR-UGC NET జూన్ 2024 పరీక్షలు నిర్వహించనున్నారు.
* సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-జూన్ 2024
అర్హతలు..
★ సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ తత్సమాన డిగ్రీ ఉండాలి. (లేదా) ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
★ 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి..
★జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.07.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. వయోపరిమితిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.
★ అసిస్టెంట్ ప్రొఫెసర్/ పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం..
➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.
➥ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 225 నగరాలు/పట్టణాల్లో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రలకు సంబంధించి ఏపీలో 20 నగరాల్లో, తెలంగాణలో 6 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.05.2024.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.05.2024 (upto 11:50 PM).
➥ దరఖాస్తుల సవరణ: 29.05.2024 - 31.05.2024.
➥ పరీక్ష తేదీ: 25.06.2024 - 27.06.2024.