NIRF Rankings 2025: విద్యామంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025ని ఈరోజు ప్రకటించింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక పత్రికా సమావేశంలో అధికారికంగా ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. విద్యా మంత్రిత్వ శాఖ NIRF అధికారిక వెబ్‌సైట్ nirfindia.orgలో అందుబాటులో ఉంచింది. ఈ సంవత్సరం కూడా ఓవరాల్ కేటగిరీలో IIT మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ వరుసగా 10వ సారి ఈ ర్యాంక్‌ను దక్కించుకుంది.

Continues below advertisement


ప్రతి సంవత్సరంలాగే, ఈసారి కూడా ఏ సంస్థ అగ్రస్థానంలో నిలుస్తుందో, ఏ కళాశాలలు మెరుగైన పనితీరు కనబరుస్తాయో అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. NIRF ర్యాంకింగ్ దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల నాణ్యతకు ఒక ముఖ్యమైన కొలమానంగా పరిగణిస్తారు. ఇది విద్యార్థులకు కెరీర్‌ను ఎంచుకోవడానికి సహాయపడుతుంది.

ఏ విభాగాల్లో ర్యాంకింగ్‌లు ప్రకటించారు?

ఈసారి ర్యాంకింగ్‌లో ఇంజనీరింగ్, వైద్య, నిర్వహణ, దంత వైద్యం (డెంటల్), ఫార్మసీ, లా, పరిశోధనతో సహా అనేక విభాగాలను చేర్చారు. విశ్వవిద్యాలయాలు, మొత్తం (Overall) విభాగాలలో కూడా సంస్థల ర్యాంకింగ్‌లను నిర్ణయించారు. ఈ జాబితా విద్యార్థులకు ఏ కళాశాల చదువు, పరిశోధన, ప్లేస్‌మెంట్ పరంగా మంచిదో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు NIRF ర్యాంకింగ్‌ల కోసం ఎదురు చూస్తారు.


ఓవరాల్ టాప్ 10 సంస్థలు - NIRF 2025



  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ

  • ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఢిల్లీ

  • జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), న్యూఢిల్లీ

  • బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU), వారణాసి


NIRF ర్యాంకింగ్‌ను ఎలా నిర్ణయిస్తారు?


NIRF అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ కొన్ని నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలను మూల్యాంకనం చేస్తుంది. ప్రతి సంస్థను ఐదు ప్రధాన పారామీటర్స్‌ పరీక్షిస్తారు. వాటి ఆధారంగా మార్కులు ఇచ్చి ర్యాంక్ నిర్ణయిస్తారు.



  • బోధన అండ్‌ అభ్యాసం (Teaching & Learning) - 30% వెయిటేజ్: ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, మౌలిక సదుపాయాలు, చదువు నాణ్యతను పరిశీలిస్తారు.

  • పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం (Research & Professional Practice) - 30% వెయిటేజ్: ఇందులో పరిశోధనా పత్రాలు, పేటెంట్లు, ప్రచురణలు, ప్రాజెక్ట్‌లను అంచనా వేస్తారు.

  • గ్రాడ్యుయేషన్ ఫలితం (Graduation Outcome) - 20% వెయిటేజ్: విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విజయం సాధించే రేటు, ప్లేస్‌మెంట్‌లు, ఉన్నత విద్యలో ప్రవేశం ఈ విభాగంలో భాగం.

  • అవుట్‌రీచ్, చేరిక (Outreach & Inclusivity) - 10% వెయిటేజ్: ఇందులో వివిధ వర్గాల, ప్రాంతాల విద్యార్థుల భాగస్వామ్యం, మహిళా విద్యార్థుల శాతం, వైవిధ్యంపై దృష్టి పెడతారు.

  • అభిప్రాయం (Perception) - 10% వెయిటేజ్: ఇందులో పరిశ్రమ, విద్యా ప్రపంచం, సమాజం దృష్టిలో సంస్థ ప్రతిష్టను కొలుస్తారు.