న్యూఢిల్లీ: ఇటీవల రద్దు చేసిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్ ను ఎన్టీఏ రీషెడ్యూల్ చేసింది. ప్రభుత్వం ఆమోదంతో NEET UG 2026 ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన అప్‌డేట్‌లు మరియు సమాచారం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు NTA అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్‌లను చూడాలని సూచించింది. నేటి ఉదయం న్యూఢిల్లీలోని 19 తీన్ మూర్తి మార్గ్‌లో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాబోయే NEET పరీక్షపై మీడియాకు వివరించనున్నారు. విద్యార్థులు రీఎగ్జామ్ కు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
మే 14న NEET పరీక్ష కోసం సన్నాహాలను అంచనా వేయడానికి కేంద్ర విద్యా మంత్రి అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. నీట్ యూజీ కోసం సన్నద్ధత, ఏర్పాట్లను చెక్ చేయడానికి విద్యా రంగంలోని సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హాజరైన వారిలో ఉన్నత విద్యా కార్యదర్శి, పాఠశాల విద్యా కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్, సీబీఎస్ఈ ఛైర్‌పర్సన్, కేంద్ర విద్యాలయ సంఘటన్ (KVS)తో పాటు నవోదయ విద్యాలయ సమితి (NVS) కమీషనర్లు ఉన్నారు.
పేపర్ లీక్ కారణంగా NEET UG పరీక్ష రద్దుపేపర్ లీక్ ఆరోపణలు రావడంతో 22 లక్షల మందికి పైగా అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని మే 3, 2026న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన NEET UG 2026 ఎగ్జామ్ రద్దు చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
NTA మే 6న NEET UG కోసం తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ పరీక్ష భారత్‌లోని 551 నగరాల్లో, విదేశాలలో 14 నగరాల్లో 5,432 కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 22.79 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఆన్సర్ కీ విడుదలయ్యాక చేతితో రాసిన గెస్ పేపర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ప్రశ్నలను అసలు ఎగ్జామ్ పేపర్‌తో పోల్చి చూడగా ఏకంగా 120 ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ, 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫీజు అక్కర్లేదు.. పాత వివరాలతోనే అడ్మిట్ కార్డులు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి అభ్యర్థులు గతంలో (మే 2026 పరీక్ష కోసం) సమర్పించిన వివరాలు, ఎంచుకున్న పరీక్షా కేంద్రాల సమాచారమే రీఎగ్జామ్‌కు కూడా వర్తిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం గానీ, అదనంగా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం గానీ లేదు. పాత హాల్ టికెట్లను రీ-ఎగ్జామ్ కు పనికిరావు. ఎన్టీఏ మళ్లీ కొత్త హాల్ టికెట్లు జారీ చేస్తుంది. ఎన్టీఏ త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తుందని అధికారులు వెల్లడించారు.
