NEET UG 2025 Application: దేశంలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సహా ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌-యూజీ)-2025' దరఖాస్తుల స్వీకరణ పక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 7 రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు నిర్ణీత ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత మార్చి 9 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు నీట్‌-యూజీ పరీక్ష కోసం సన్నద్ధమవతుంటారు. గతేడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంబీబీఎస్‌లో మొత్తం 1,08,000 సీట్లు అందుబాటులో ఉండగా.. సుమారుగా 56 వేల సీట్లు ప్రభుత్వ, 52 వేల సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. 


పరీక్ష ఫీజు ఎంతంటే?
నీట్ యూజీ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు పరీక్ష ఫీజుగా జనరల్‌ క్యాటగిరీవారు రూ.1700; ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వర్గాలకు చెందినవారైతే రూ.1600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.1000గా నిర్ణయించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి సిటీ ఇంటీమేషన్ స్లిప్స్‌‌ను ఏప్రిల్‌ 26న విడుదల చేయనున్నారు. విద్యార్థులు మే 1 నుంచి నీట్ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 14లోపు ఫలితాలు విడుదల చేయనున్నారు. 


NEET(UG)-2025 Registration and Online Application


Press Note


పాతవిధానంలోనే పరీక్ష..
దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌(National Eligibility cum Entrance Test) యూజీ (NEET UG 2025) పరీక్షను ఆన్‌లైన్‌ కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షను పాతవిధానంలోనే నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఇకపై పాత విధానంలోనే 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంతో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు(3 గంటలు) ఉండనుంది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) నిర్ణయం మేరకు.. నీట్‌ యూజీ పరీక్ష పెన్‌-పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.


ప్రశ్నల ఎంపిక విధానానికి స్వస్తి..
నీట్ యూజీ పరీక్షకు సంబంధించి కోవిడ్‌ సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నల ఎంపిక విధానం తీసివేసినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 45 చొప్పున ప్రశ్నలు, బయాలజీలో నుంచి 90 ప్రశ్నలకు 3 గంటల్లో పరీక్షను రాయాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో పెన్‌-పేపర్‌ (OMR based) విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.


నీట్‌ ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు.. నేషనల్‌ కమిషన్ ఫర్‌ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్‌ (BHMS) కోర్సులో ప్రవేవాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్‌డ్‌ మెడికల్‌ సర్వీస్‌ హాస్పిటల్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ (BSc Nursing) కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు కూడా నీట్‌ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తెలిపింది.


ఆన్‌లైన్‌పై వెనక్కి..
దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌ యూజీ నిలుస్తోన్న సంగతి తెలిసిందే. నీట్ యూజీ పరీక్షకు గతేడాది 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌ తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్‌ యూజీని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ - CBT)లో నీట్‌ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్‌ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..